: నాటకం నాకు జీవితాన్ని నేర్పింది: నటుడు, రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు

‘నాటకం నాకు జీవితాన్ని నేర్పింది’ అంటున్నారు రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు అన్నారు. రంగస్థల నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తాను ఎదిగిన క్రమం, ప్రస్తుతం వస్తున్న నాటకాల తీరుపైన, తనకు సినీ అవకాశాలు ఏ విధంగా వచ్చాయనే విషయాలపైన ఆయన మాట్లాడారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణేశ్వరరావు మాట్లాడుతూ, నాటకం జీవకళ అని, దాని నుంచి జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చని చెప్పారు. రంగస్థలం ఉజ్వలంగానే ఉందని, దానిని ప్రోత్సహిస్తే మరింత ముందుకు వెళుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వస్తున్న నాటికల్లో ‘ఆత్మ’ కనిపించడం లేదని, రచయితలు తమ నాటిక ద్వారా తాము చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారని రచయితలు ఆయన అభిప్రాయపడ్డారు. ‘రంగస్థలాన్ని ప్రోత్సహించేందుకుగాను ప్రభుత్వం ముందుకు రావాలి. నాటికల పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఆర్ట్ అండ్ కల్చర్ పై ప్రచారానికి కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వర్క్ షాపులు, సెమినార్లు నిర్వహించాలి, టౌన్లలో, గ్రామాల్లో ఆడియన్స్ క్లబ్ లు ఏర్పాటు చేయడం ద్వారా కళను ప్రోత్సహించవచ్చు. టీవీ, సినిమాలు మొదలైన మాధ్యమాల కారణంగా రంగస్థలం గుర్తింపు క్షీణించకుండా ఉండాలంటే కల్చరల్ సంస్థలు ముందుకు రావాలి.. విలువైన వారసత్వ సంపదను కాపాడాలి" అన్నారాయన. "పొరుగు రాష్ట్రాల్లో రంగస్థలం బాగుంది. మంచి సబ్జెక్టులే వస్తున్నాయి. హై టెక్నికల్ విలువలతో డ్రామాలు రూపొందిస్తున్నారు. సామాజిక ఇతివృత్తాలతో పాటు గుడ్ స్క్రిప్ట్ తో వచ్చే ప్లేలెట్స్ థియేటర్ ఆర్ట్ కు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి’ అని కృష్ణేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రంగస్థలం, సినిమాల్లో తన ప్రవేశం గురించి ఆయన చెబుతూ... పాఠశాల విద్య నుంచే తన నటనా ప్రస్థానం మొదలైందని తాను నటించిన మొదటి నాటిక ‘వాపస్’ అని చెప్పారు. ‘రోజూ చస్తున్న మనిషి’, ‘గొంగళిపురుగు’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘సంపద’ తాను రచించి దర్శకత్వం వహించిన నాటికలని చెప్పారు. అంతకుముందు, ‘కాళ్లు కడిగిన చేతులు’, ‘అధికారి’, ‘నష్టపరిహారం’, ‘భూమి కోసం’ వంటి నాటికలతో పాటు ‘కాళ్లు కడిగిన చేతులు’ నాటకంలో కూడా తాను నటించానని అన్నారు. ఈ నాటకంలో ప్రముఖ నటులు ఏవీఎస్, శివపార్వతితో కలిసి నటించాని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 1000 నాటిక ప్రదర్శనలు ఇచ్చానని చెప్పారు. ‘రోజూ చస్తున్న మనిషి’ నాటిక చూసిన నాటి సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి తనకు ‘ప్రచండ భారతం’ సినిమాకు మాటలు రాసే అవకాశమిచ్చారని చెప్పారు. ‘అంకురం’, ‘శ్రీరాములయ్య’, ‘జయం మనదే’, ‘భద్రాచలం’, ‘ఓసి నీ ప్రేమ బంగారం కాను’, ‘ఎర్రసముద్రం’, ‘కూతురు కోసం’,‘రూమ్ మేట్స్’, ‘గోపి, గోపిక, గోదావరి’, సరదాగా ‘కాసేపు’, ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’ తదితర చిత్రాల్లో ఆయన నటించడంతో పాటు అందులో కొన్ని చిత్రాలకు రచనా సహకారం అందించడమే కాకుండా రచయితగా కూడా వ్యవహరించానన్నారు. వంశీ, ఉమా మహేశ్వరరావు, శంకర్, ఏవీఎస్, ప్రవీణ్ సత్తార్ మొదలైన దర్శకులతో కలిసి పనిచేశానని కృష్ణేశ్వరరావు వివరించారు.

More Telugu News