: రెండేళ్ల చిన్నారి గుండె, మెదడులను స్తంభింపజేసి... అత్యంత క్లిష్టతరమైన శస్త్రచికిత్స, సక్సెస్!

వైద్య ప్రక్రియలోనే అత్యంత క్లిష్టతరమైన డీప్ హైపోతర్మిక్ సర్క్యులేటరీ అరెస్ట్ (డీహెచ్సీఏ) ను ఓ రెండేళ్ల బాలుడిపై ప్రయత్నించిన కొచ్చి డాక్టర్లు దాదాపు 9 గంటల పాటు శస్త్రచికిత్స చేసి, బాలుడి గుండెలో పెరుగుతున్న 200 గ్రాముల క్యాన్సర్ కణితిని విజయవంతంగా బయటకు తీశారు. ఆదీ తోపిల్ ఫబీర్ అనే పేరున్న రెండేళ్ల బాలుడి గుండెల్లో కణితి పెరుగుతోందని, దీన్ని మరింతగా పెరగనిస్తే, అది అతని ప్రాణాలకే ప్రమాదమని గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసేందుకే నిర్ణయించారు. మొత్తం 30 మంది డాక్టర్లు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. శస్త్రచికిత్సలో భాగంగా, సాధారణంగా మానవ శరీరంలో ఉండే 37 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ ను 15 డిగ్రీల సెల్సీయస్ కు తీసుకువెళ్లారు. వాస్తవానికి 22 డిగ్రీలకు చేరితేనే మనిషి చనిపోతాడు. ఈ దశలో ఆదీ గుండెను, మెదడు పనిని 40 నిమిషాల పాటు ఆపేసిన డాక్టర్లు, సగభాగం గుండెలో, మిగతా భాగం గుండె వెలుపలా ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. "ఈ తరహా ఆపరేషన్లు ప్రపంచంలో ఇప్పటివరకూ ఐదు మాత్రమే జరిగాయి. మిగతా నాలుగు కేసుల్లో కణితి గుండెకు లోపల ఉంది. ఈ కేసులో కొంత భాగం బయట కూడా ఉంది. చికిత్సలో పాల్గొన్న ప్రతి డాక్టర్ కూ నా అభినందనలు" అని వీపీఎస్ లేక్ షోర్ ఆసుపత్రి కార్డియాక్ విభాగం హెడ్ డాక్టర్ ఎంకే మోసా కున్హీ వ్యాఖ్యానించారు. కణితి కారణంగా 95 శాతం రక్త ప్రసరణ ఆగిపోయిన క్రిటికల్ పరిస్థితుల్లో ఆదీని తమ వద్దకు తీసుకు వచ్చారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ బాబు వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు.

More Telugu News