: 'రజనీ స్టామినా ఇదే' అంటూ పొగడ్తల వర్షం కురిపించిన విదేశీ మీడియా

"భారత చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రతియేటా 20కి పైగా భాషల్లో 1600కు పైగా కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. ఇండియాలో అతిపెద్ద స్టార్ రజనీకాంత్. అందుకు తాజా 'కబాలి' ఫ్యాన్ మేనియానే కొలమానం" అంటూ విదేశీ మీడియా రజనీ స్టామినాపై పొగడ్తల వర్షం కురిపించింది. 'ది వాషింగ్టన్ పోస్ట్' కబాలి చిత్రం గురించిన విశేషాలు చెబుతూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అభిమానులతో ఇంటర్వ్యూలు చేసి వారి అభిప్రాయాలను వెల్లడించింది. 65 ఏళ్ల వయసున్న రజనీకాంత్, అదే వయసున్న ఇతర నటులతో పోలిస్తే, ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారని, ఏ రాజకీయ నాయకుడికీ లేనంతమంది అభిమానులు ఆయనకు ఉన్నారని తెలిపింది. కబాలి టీజర్ విడుదలైతే వారం రోజుల్లో దాన్ని 3 కోట్ల మందికి పైగా వీక్షించారని, ఆయనకున్న సమ్మోహనా శక్తి అటువంటిదని గుర్తు చేసింది. శివాజీ రావ్ గైక్వాడ్ గా పుట్టిన ఆయన జీవితంపై క్లుప్తంగా చెబుతూ, కానిస్టేబుల్ కొడుకైన ఆయన, కార్పెంటర్ విధులను, రైల్వేల్లో మూటలను మోశారని, ఆపై బస్ కండక్టరుగా పనిచేశారని గుర్తు చేసింది. ఓ మూవీ డైరెక్టర్ ఆయన్ను చూసి, తన చిత్రంలో భార్యను, చెల్లిని వేధించే భర్త వేషం ఇచ్చారని, ఆపై దశాబ్దానికే ఆయన సూపర్ స్టార్ గా ఎదిగారని పేర్కొంది. ఆయన తన సన్ గ్లాస్ లను తిప్పే విధానం, సిగరెట్ వెలిగించే పద్ధతులు అభిమానులను ఎంతో అలరిస్తాయని, ఆ స్టయిలే ఆయన్ను తిరుగులేని కథానాయకుడిగా నిలిపిందని పేర్కొంది. నిజజీవితంలో ఆయన ఎంతో సింపుల్ గా ఉంటారని, ఆధ్యాత్మిక భావాలు అధికమని చెప్పింది. ఆయన చిత్రం విడుదలవుతుంటే వేల లీటర్ల పాలతో అభిమానులు అభిషేకాలు చేస్తారని, కబాలి విషయంలో మాత్రం అధిక పాల ధరలు, అభిమానుల్లో పాలపై చైతన్యం తెచ్చిన స్వచ్ఛంద సంస్థల కారణంగా, పాలాభిషేకాలు తగ్గాయని 'ది వాషింగ్టన్ పోస్ట్' తెలిపింది. ఈ చిత్రాన్ని చూసేందుకు చెన్నైలోని ఓ థియేటరు వద్ద కిలోమీటరు దూరం సాగిన క్యూలో ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆంటోనీ రాజ్ కుమార్ (26)ను ఇంత అవస్థలు పడటం అవసరమా? అని ప్రశ్నించగా, "మీ భార్య బిడ్డను కంటే, ఆ బిడ్డను చూసేందుకు కొన్ని రోజులు ఆగడం అవసరమా?" అన్న సమాధానం ప్రశ్న రూపంలో ఎదురైందని రజనీకాంత్ స్టామినాకు ఇదే నిదర్శనమని ఆ కథనం తెలిపింది.

More Telugu News