: అండర్-12 క్రికెట్ జట్టులో నాలుగేళ్ల బుడతడు.. అద్భుత బ్యాటింగ్ తో అబ్బుర పరుస్తున్న చిచ్చర పిడుగు!

ఇది నిజంగా సంచలనమే. నాలుగేళ్లు అంటే తల్లి చుట్టూ చక్కర్లు కొట్టే వయసు. బొమ్మలతో ఆడుకునే వయసు. అల్లరి చేష్టలతో నవ్వులు పూయించే వయసు. కార్టూన్ చానళ్లను వదలకుండా చూసే వయసు. కానీ ఇదే వయసులో ఓ చిచ్చర పిడుగు ఏకంగా అండర్-12 క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అదేమీ ఆషామాషీగా కాదు... తన అద్భుత ఆటతీరుతో! ఢిల్లీకి చెందిన షాయన్ జమల్(4) అండర్-12 క్రికెట్ స్కూల్ జట్టులో స్థానం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్లబ్ లెవల్ ఆటగాడైన షాయన్ తండ్రి కుమారుడిలో ఉన్న ఆసక్తిని గమనించి చిన్నప్పటి నుంచే అతనికి క్రికెట్‌లో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బుడ్డోడు క్రికెట్ కోచ్ ఉత్తమ్ భట్టాచార్య శిక్షణలో మరింత రాటుదేలుతున్నాడు. షాయన్‌లోని ప్రతిభను గుర్తించిన ఉత్తమ్ వెంటనే తన అకాడమీలో చేర్చుకుని తీర్చిదిద్దుతున్నారు. ఇంత చిన్న వయసులోనే క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న షాయన్ నిజంగా వండర్ బాయ్ అని ఉత్తమ్ పేర్కొన్నారు. మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను షాయన్ తలపిస్తున్నాడని అన్నారు. నాలుగేళ్ల వయసులోనే ఇంతటి ప్రతిభ కనబరుస్తుండడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమన్నారు. ఏదో ఒకరోజు షాయన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమని ఉత్తమ్ జోస్యం చెప్పారు.

More Telugu News