: అమ్మాయిలు పుడితే బిల్లు కట్టక్కర్లేదు... ప్రైవేటు ఆస్పత్రి బంపర్ ఆఫర్: లింగ నిష్పత్తిని పెంచేందుకేనట!

సమాజంలో అమ్మాయిలపై పెరిగిపోతున్న వివక్షను తగ్గించి, లింగ నిష్పత్తి (సెక్స్ రేషియో)ని పెంచేందుకు గుజరాత్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం ముందుకొచ్చింది. ఇక నుంచి తమ ఆస్పత్రిలో చేరిన గర్భిణులు ఆడపిల్లలకు జన్మనిస్తే ఫీజు కట్టాల్సిన పనిలేదని పేర్కొంది. పైపెచ్చు రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన రూ.1100ను కూడా తిరిగి ఇచ్చేస్తామని తెలిపింది. తమ ఆస్పత్రి నుంచి ఆడపిల్లల తల్లిదండ్రులు సంతోషంగా వెళ్లాలన్నదే తమ ధ్యేయమని వివరించింది. సింధు సేవ సమాజ్ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో గత మూడు దశాబ్దాలుగా సింధు ఆస్పత్రి సేవలు అందిస్తోంది. గుజరాత్ లో 1000 మగపిల్లలు పుడితే, ఆడపిల్లలు 890 మంది మాత్రమే పుడుతున్నారు. దీంతో లింగ నిష్పత్తి దారుణంగా వుంది. ఈ వ్యత్యాసాన్ని గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం గత నెలలో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటి వరకు 150 మంది గర్భిణులు రిజిస్టర్ చేసుకున్నారు. సాధారణంగా ఈ ఆస్పత్రిలో సాధారణ ప్రసవానికి రూ.7వేలు, సిజేరియన్‌కు రూ.20వేలు వసూలు చేస్తారు. మగ పిల్లాడు జన్మిస్తే స్వీట్లు పంచి సంతోషపడే తల్లిదండ్రులు, అమ్మాయి పుడితే ఆ పనిచేయడం లేదని ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ మహాదేవ్ లోహన అన్నారు. ఇక నుంచి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఆస్పత్రి నుంచి వెళ్లాలనే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆడపిల్ల పుడితే ప్రతీ ఒక్కరు గర్వపడాలని, ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యిమంది అబ్బాయిలకు 850 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని మాహాదేవ్ వివరించారు. సింధ్ ఆస్పత్రిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని ఆస్పత్రులు ఈ విషయంలో ముందడుగు వేస్తే ఆడపిల్లల నిష్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

More Telugu News