: వేతన జీవికి పెను నిరాశ... 40 ఏళ్ల కనిష్ఠానికి తగ్గనున్న పీఎఫ్ వడ్డీ రేటు!

పదవీ విరమణ చేసిన అనంతరం, జీవితం ఏ ఒడిదుడుకులకూ లోనుకాకుండా సాగే ఉద్దేశంతో భవిష్య నిధిని కూడబెట్టుకునే వేతన జీవికి పెను నిరాశను కలిగించే విషయమిది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నిధిపై ఇస్తున్న వడ్డీ రేటు 8 శాతానికి తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, 1979 తరువాత, అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత వడ్డీ రేటు అతి తక్కువ స్థాయికి చేరినట్టు. ప్రభుత్వ డెట్ సెక్యూరిటీలతో, అవిచ్చే మెచ్యూరిటీ మొత్తంతో అనుసంధానమై ఉంటే పీపీఎఫ్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని కేంద్రం నిర్ణయిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ సెక్యూరిటీలపై గత పదేళ్లలో వచ్చిన సరాసరి ఆదాయం 7.30 శాతంగా ఉండగా, దీనిపై అదనంగా వడ్డీని ఇస్తే, ఖజానాపై భారం పడుతుందన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం, ప్రతి మూడు నెలలకూ ఓమారు చిన్న మొత్తాల పొదుపు, పీపీఎఫ్ ఖాతాలపై వడ్డీలు మారుతూ ఉంటాయి. దేశ ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ, అందుకు అనుగుణంగా వడ్డీని నిర్ణయిస్తూ ఉంటుంది. ఇటీవలి పరిస్థితులను గమనిస్తే, ప్రభుత్వ సెక్యూరిటీలు గత మూడు నెలల్లో ఇచ్చిన రాబడితో పోలిస్తే, పీపీఎఫ్ వడ్డీ రేటు 0.25 శాతం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ రేటు తగ్గిస్తూ నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్టు 'రైట్ హోరైజన్స్' వ్యవస్థాపక సీఈఓ అనిల్ రెగో అభిప్రాయపడ్డారు. కాగా, జూలై - సెప్టెంబర్ త్రైమాసికానికి ప్రభుత్వం పీపీఎఫ్ రేటును నేడో రేపో ప్రకటించనుంది.

More Telugu News