: శాస్త్రవేత్తలకు సవాలు విసురుతున్న చైనా మమ్మీ!

చైనాలోని ఓ మమ్మీ శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతోంది. వివరాల్లోకి వెళ్తే... పురావస్తు శాస్త్రవేత్తలు ఓ మమ్మీని కనుగొన్నారు. అనంతరం ఆ మమ్మీని చూసి ఆశ్చర్యపోయారు. దానికి కారణం, సమాధి చేయబడ్డ ఆ మహిళ మమ్మీ రెండువేల సంవత్సరాల క్రితంది అయినప్పటికీ, ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అలా ఆమె శరీరం చెడిపోకుండా ఉండేందుకు ఎలాంటి లేపనాలు వాడారు? అన్నది మిస్టరీగా మారింది. సాధారణంగా మరణించిన తరువాత ఆ మృతదేహానికి ఎంతటి రసాయనాలు పూసి భద్రపరిచినా చర్మం, ఇతర శరీర భాగాలు నెమ్మదిగా అంతరిస్తాయి. చివరికి కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. వాటికి భిన్నంగా ఈ మమ్మీ శరీరం మాత్రం చెడిపోలేదు సరికదా, చర్మం రాబ్బరులా సాగుతోంది. కేవలం ముఖం మాత్రమే గుర్తుపట్టలేని విధంగా మారింది. ఇతర భాగాలన్నీ రబ్బరులా సాగడం శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసింది. దీంతో ఆమె శరీరాన్ని అలా భద్రపరిచేందుకు వాడిన రసాయనాలు, లేపనాల అంతు చూసేందుకు చాలాకాలంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఏళ్ల తరబడి పరిశోధనలు సాగుతున్నప్పటికీ ఆమె శరీరాన్ని భద్రపరిచేందుకు ఎలాంటి రసాయనాలు పూశారన్నది కనుక్కోలేకపోయారు. ఆమె ఊబకాయురాలై ఉంటుందని, మరణించే ముందు పుచ్చకాయ తిని ఉంటుందని గుర్తించారు. ఎందుకంటే, ఆమె శరీరంలో పుచ్చకాయ గింజలను గుర్తించారు. ఆమె గుండెపోటుతో మరణించి ఉండచ్చని అంచనా వేస్తున్నారు.

More Telugu News