: ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడినందుకు మూల్యం చెల్లించుకున్నా: దువ్వూరి సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు

ఇండియాలోని బ్యాంకులను నియంత్రించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్వయం ప్రతిపత్తి ఉండాలని పోరాడిన తాను, అందుకు మూల్యం చెల్లించుకున్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 2008 నుంచి 2013 వరకూ అత్యంత క్లిష్టమైన సమయమని అన్నారు. తాను రాసిన తాజా పుస్తకం విడుదల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్లను గట్టి నియంత్రణలో ఉంచాలన్న తన నిర్ణయానికి అప్పటి ఆర్థిక మంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు వ్యతిరేకిస్తుండే వారని గుర్తు చేసుకున్నారు. వడ్డీ రేట్లపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వారు భావిస్తుండేవారని, ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని కోరేవారని అన్నారు. తాను మాత్రం ద్రవ్యోల్బణంపై మాత్రమే దృష్టిని సారించి, వృద్ధి రేటు తగ్గకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రాధాన్యమిచ్చానని అన్నారు. వృద్ధి బాటలో సవాళ్లను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఒక దశలో చిదంబరం సైతం రిజర్వ్ బ్యాంకుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. తాను ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ నచ్చలేదని స్పష్టంగా చెప్పగలనని దువ్వూరి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలు వడ్డీ రేట్లపై తన మీద ఒత్తిడి తెస్తుండేవారని గుర్తు చేసుకున్నారు. అధిక వడ్డీ రేట్ల కారణంగా పెట్టుబడులు రావడం లేదని, వృద్ధి మందగిస్తోందని చిదంబరం, ప్రణబ్ లిద్దరూ తనతో వాదించేవారని అన్నారు. ఆనాటి తన వైఖరే ఇప్పుడు తనను ఖాళీగా ఉంచిందని చెప్పుకొచ్చారు.

More Telugu News