: "ఎందుకు తొలగించారో" అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన 'హాకీ క్వీన్' రీతూ రాణి!

రీతూ రాణి... నిన్నటి వరకూ భారత హాకీ మహిళా జట్టు కెప్టెన్. దాదాపు 36 సంవత్సరాల తరువాత భారత మహిళల టీమ్ ను ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ రౌండును దాటించి ప్రధాన పోటీలకు వెళ్లేలా చేసిన ప్రతిభ ఉన్న క్రీడాకారిణి. ఆమె నాయకత్వంలో భారత జట్టు ఎన్నో విజయాలను అందుకుంది కూడా. ఇక రియోలో మరో నాలుగు వారాల్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీలకు భారత జట్టును ఎంపిక చేస్తూ, సెలక్షన్ కమిటీ రీతూకు పెను షాక్ నే ఇచ్చింది. ఆమెను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు, జట్టు నుంచి కూడా ఉద్వాసన పలికింది. ఆమె ప్రవర్తనా తీరు బాగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హాకీ ఇండియా తీసుకున్న నిర్ణయంపై రీతూ తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేసింది. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతున్న వేళ, ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. "ఈ వార్త నాకు దిగ్భ్రాంతిని కలిగించింది. నాకు ఏ విధమైన ఫిట్ నెస్ సమస్యలు లేవు. జట్టు సభ్యులతో ఎంతో కలుపుగోలుగా ఉంటాను. నన్నెందుకు జట్టు నుంచి తొలగించారో కూడా చెప్పలేదు. నేను ఎన్నడూ శిక్షణకు డుమ్మా కొట్టలేదు. ఇన్నాళ్లూ ఆడిన ఆటంతా వృథా అన్నట్టుగా అనిపిస్తోంది. నాకు కాబోయే భర్త (సర్దార్ సింగ్... భారత హాకీ జట్టు పురుషుల కెప్టెన్. ఇతన్ని కూడా కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే, జట్టులో మాత్రం ఉన్నాడు) కూడా తీవ్ర నిరుత్సాహంలో ఉన్నాడు. నాకే ఎందుకిలా జరిగింది?" అని వాపోయింది. కౌలాలంపూర్ లో 2013లో జరిగిన ఆసియా కప్ లో, ఇంచియాన్ లో 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు కాంస్య పతకాలను భారత్ గెలుచుకోవడానికి రీతూ తన వంతు కృషి చేసింది. తన స్టిక్ తో బంతిని ఎవరి వద్దకైనా సూటిగా పంపగలిగే రీతూ, మిడ్ ఫీల్డ్ లో అత్యంత ప్రధానమైన క్రీడాకారిణి.

More Telugu News