: రెండు గంటలు గదిలో చిక్కుకుపోయిన న్యూజిలాండ్ మహిళను కాపాడిని ఎన్ఆర్ఐ మహిళ!

న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ శివారుల్లోని సబ్‌ వే శాండ్‌ విచ్ షోరూమ్‌ వెనుకనున్న గదిలో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేసిన ఓ మహిళను ఎన్ఆర్ఐ మహిళ రక్షించింది. వివరాల్లోకి వెళ్తే... అమన్‌ దీప్ సింగ్ అనే వ్యక్తి తన భార్యతో కలసి ఆహార పదార్థాలు కొనుగోలు చేసేందుకు ఆదివారం రాత్రి 9.45 గంటల సమయంలో న్యూమార్కెట్‌ లోని సబ్‌ వే ఎంట్రీ దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో దుకాణం వెనుకనున్న డోర్ లోంచి... ఫ్రీజర్‌ లో చిక్కుకుపోయానని, తనను కాపాడమని ఓ మహిళ ఆర్తనాదం చేయడం వినిపించింది. ఈ అరుపులు విన్న అమన్ దీప్ సింగ్ తన భార్య రెజీకి విషయాన్ని చెప్పి, ఎలా వెళ్లి ఆమెను రక్షించాలో వివరించాడు. రెజీ అక్కడున్న కౌంటర్‌ మీదుగా లోపలికి దూకి, మూసుకుపోయిన డోర్‌ ను చాకచక్యంగా తెరిచింది. అదే సమయంలో, ఆయన తన సెల్ ఫోన్ లోని వీడియో ఆన్ చేసి, తన భార్య వెళ్లి, తలుపు ఓపెన్ చేయడం, ఆమెను రక్షించడం.. ఆ మొత్తం తతంగాన్ని రికార్డ్ చేశాడు. దీంతో రెండు గంటలకు పైగా దుకాణంలో చిక్కుకుపోయిన ఆమె బయటపడగానే భయంతో వణికిపోయింది. రెజీని ఆలింగనం చేసుకుని బావురుమని ఏడ్చేసింది. దీంతో రెజీ ఆమెను ఓదార్చింది. ఈ వీడియోను సోషల్ మీడియోలో అప్ లోడ్ చేసిన అమన్ దీప్ ఈ ఘటనను వీడియో తీయడంపై వివరిస్తూ, సబ్ వే షాప్ లో అక్రమంగా ప్రవేశించడం అనేది దొంగతనం కేసు అవుతుందని, అందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యవహారం మొత్తాన్ని చిత్రీకరించానని అన్నారు. దీనిపై షాపు సిబ్బంది వివరణ ఇస్తూ, బాధితురాలు చిక్కుకుంది ఫ్రీజర్‌ లో కాదని, బాత్రూంలో అని చెప్పారు. ఈ సమయంలో ఆమె వద్ద కనీసం సెల్‌ ఫోన్ కూడా లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News