: స్పైస్ జెట్ కు కొత్తగా 100 విమానాలు... రూ. 80 వేల కోట్లతో బ్లాక్ బస్టర్ డీల్ కు సన్నాహాలు!

స్పైస్ జెట్... ఇండియాలో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థగా సేవలందిస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న స్పైస్ జెట్, ఇప్పుడు తలెత్తుకు నిలిచి లాభాల బాటలో పరుగులు పెడుతోంది. ఒకప్పుడు విమాన ఇంధనం ఇచ్చేందుకు చమురు కంపెనీలతో నిరాకరింపబడ్డ స్పైస్ జెట్, నేడు బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ స్థాయికి ఎదిగింది. ఇక తాజాగా, 100 కొత్త విమానాల కొనుగోలు కోసం స్పైస్ జెట్ 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80 వేల కోట్లు) విలువైన భారీ డీల్స్ ను కుదుర్చుకోనుందని ఫారిన్ మీడియాలో వార్తలు వచ్చాయి. బోయింగ్, ఎయిర్ బస్ వంటి కంపెనీలు స్పైస్ జెట్ కు విమానాలు అందించేందుకు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. ఈ భారీ డీల్ ను తమకిస్తే, డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నట్టు, డీల్ చర్చల గురించి తెలిసిన కంపెనీ వర్గాలు వెల్లడించాయి. బోయింగ్ సంస్థకు ఈ డీల్ అత్యంత కీలకమని నిపుణులు వ్యాఖ్యానించారు. చైనా, యూఎస్ లతో పోలిస్తే మరింత వేగంగా ఇండియాలో విమానయాన రంగం విస్తరిస్తున్న వేళ, స్పైస్ జెట్ వంటి అభివృద్ధి చెందుతున్న సంస్థలకు విమానాల సరఫరా డీల్ కుదుర్చుకోవాలని భావించడం సహజమేనన్నారు. ఒకవేళ బోయింగ్ ఈ డీల్ కుదుర్చుకోకుంటే భారీగా నష్టపోయినట్టేనని కేపీఎంజీ ఏరోస్పేస్ విభాగం హెడ్ అంబర్ దూబే వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం స్పైస్ జెట్ వద్ద 43 విమానాలు ఉన్నాయి. భారత ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీలో 108 విమానాలు, 38.5 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చూపుతున్న ఇండిగోను దెబ్బకొట్టాలంటే మరిన్ని విమానాలు కొనడం ఒక్కటే స్పైస్ జెట్ ముందున్న మార్గం. ఇక ఇండిగో యాజమాన్య సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్, ఇప్పటికే 430 కొత్త ఎయిర్ బస్ ఏ320 నియో విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 1000 విమానాలు కలిగివుండాలన్నది ఇంటర్ గ్లోబ్ లక్ష్యంగా తెలుస్తోంది. గత వారంలో ఫ్రాన్ బోర్గ్ లో జరిగిన ఎయిర్ షోలో స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పాల్గొన్నారని, అక్కడికి వచ్చిన బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేస్కర్ తో చర్చలు కూడా జరిపారని స్పైస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరిన్ని వివరాలు అందించేందుకు ఆయన నిరాకరించినప్పటికీ, దినేశ్ మీడియాతో మాట్లాడుతూ, "స్పైస్ జెట్ తో మా భాగస్వామ్యం కొనసాగుతుంది. సంస్థకు తొలి 737 మ్యాక్స్ ను త్వరలోనే డెలివరీ చేస్తాం" అని తెలిపారు. ఇక సీ-సిరీస్ నారో బాడీ విమానాలను భారత కంపెనీలకు విక్రయిస్తున్న బొంబార్డియర్ సైతం స్పైస్ జెట్ తో డీల్ కుదుర్చుకోవాలని భావిస్తోంది. బ్రెజిల్ కు చెందిన ఎంబ్రారర్, ఇటలీ సంస్థ ఫిన్ మెకానికా, ఎయిర్ బస్ ల జాయింట్ వెంచర్ ఏటీఆర్ (ఏవియాన్స్ డీ ట్రాన్స్ పోర్ట్ రీజనల్) సైతం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయని విదేశీ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

More Telugu News