: గిరిజనులకు నీరిచ్చేందుకు అగ్రవర్ణాల నిరాకరణ.. బావి తవ్వి చూపించిన మహిళ

తమకు నీరిచ్చేందుకు నిరాకరించిన అగ్రవర్ణాల ప్రజలకు సొంతంగా బావి తవ్వి తానేంటో నిరూపించిందో గిరిజన మహిళ. సమాజంలో ఇంకా అక్కడక్కడా అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ కాగా, గిరిజన మహిళ పట్టుదలకు ఇదో మచ్చుతునక. ఉత్తరప్రదేశ్‌లోని డుబ్బి గ్రామంలో దాదాపు 40 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికీ నీటి అవసరాల కోసం గ్రామంలోని చేతిపంపే దిక్కు. అయితే దానిని ముట్టుకోకూడదంటూ గిరిజనలపై అగ్రవర్ణాల వారు ఆంక్షలు విధించారు. నీటి కోసం ప్రతీరోజూ వారితో గిరిజనులు యద్ధం చేసినంత పనిచేసి చివరికి ఓ బిందెడు నీళ్లు సంపాదించుకునేవారు. రోజూ నీటి కోసం పాట్లు పడాల్సి వస్తుండడంతో ఐదేళ్ల క్రితం గ్రామానికి చెందిన కస్తూరి అనే గిరిజన మహిళ గ్రామం నుంచి వేరే చోటుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే అంగీకరించలేదు. అయితే ఆమె మాత్రం ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలోని ఓ ప్రదేశానికి వెళ్లి గుడెసె వేసుకుని ఒంటరిగా ఉండసాగింది. గ్రామం నుంచి వెళ్లిపోయిన ఆమెను చాలామంది హేళన చేసినా ఆమె పట్టించుకోలేదు. ఒంటరిగా ఉంటున్న కస్తూరికి అడవిలోని రాళ్ల మధ్య నుంచి కారే నీళ్లు ఆధారమయ్యేవి. అయితే మధ్యలో ఓ రెండు రోజులు నీళ్లు రాకపోవడంతో అల్లాడిపోయింది. దీంతో బావి తవ్వాలని నిర్ణయించుకున్న ఆమె రెండు సార్లు ప్రయత్నించి మధ్యలో విరమించింది. ఆ తర్వాత మరో మారు ప్రయత్నించి బావి తవ్వడం ప్రారంభించింది. ఆమె చేస్తున్న మంచి పనిని చూసిన కుటుంబ సభ్యులు ఆమెకు చేదోడు వాదోడుగా నిలిచారు. విషయం తెలిసి మిగతా గిరిజనలు కూడా చేయందించారు. దీంతో ఈ జూన్ నాటికి 25 అడుగుల లోతైన బావిని తవ్వారు. అయినా నీళ్లు పడకపోవడంతో నిరాశ చెందారు. అయితే వర్షాకాలం కావడంతో నీళ్లు చేరే అవకాశం ఉందని భావించారు. వారం తర్వాత బావిలోంచి నీరు ఊరడంతో వారి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇప్పుడా బావి 40 కుటుంబాల దాహార్తిని తీరుస్తోంది.

More Telugu News