: నేను ఏ తప్పూ చేయలేదు!... విజయ్ మాల్యా ప్రకటన!

17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర అప్పులను ఎగ్గొట్టి ఎంచక్కా విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సంస్థ వేసిన చెక్ బౌన్స్ కేసులో దోషేనని ఇప్పటికే హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు తేల్చేసింది. ఇక బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్న ఆయన ఉద్దేశపూర్వక ఎగవేతదారేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లిక్కర్ కింగ్ పాస్ పోర్టును రద్దు చేసింది. ఇక మాల్యాకు చెందిన సొంత కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) కూడా ఆయనను నేరగాడిగానే తేల్చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.1,125 కోట్లను మాల్యా గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించారని తేల్చిచెప్పింది. అయితే ఈ ఆరోపణలపై నిన్న మాల్యా ఓ సంచలన ప్రకటన విడుదల చేశారు. తానేమీ తప్పు చేయలేదని ఆయన సదరు ప్రకటనలో పేర్కొన్నారు. తన హయాంలో ఏం జరిగినా... అన్ని విషయాలను కంపెనీ డైరెక్టర్ల బోర్డు, వాటాదారుల ఆమోదంతోనే చేశానని ఆయన చెప్పుకొచ్చారు. యూఎస్ఎల్ లో మెజారిటీ వాటా తీసుకున్న డియాజియో కూడా అకౌంట్లను పూర్తిగా తనిఖీ చేసుకుని, సంతృప్తి చెందాకే వాటా తీసుకుందని కూడా ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు.

More Telugu News