: యూరో కప్ విజేత పోర్చుగల్!... తొలిసారి విజేతగా నిలిచిన రొనాల్డో జట్టు!

యూరో కప్ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. రోనాల్డో లాంటి చిచ్చర పిడుగుల్లాంటి ఆటగాళ్లున్న చిన్న దేశం పోర్చుగల్ సాకర్ లో కాకలు తీరిన ఫ్రాన్స్ ను చిత్తు చేసింది. వెరసి యూరో కప్ చరిత్రలోనే పోర్చుగల్ తొలిసారి విజేతగా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో పోర్చుగల్ తో ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ చివరి దాకా పోరు సాగించింది. నిర్ణీత సమయంలో ఏ ఒక్క జట్టు కూడా గోల్ చేయలేకపోయాయి. దీంతో అదనపు సమయం కేటాయించక తప్పలేదు. ఈ సమయంలో పోర్చుగల్ ఆటగాడు ఎడర్ 109వ నిమిషంలో దాదాపు 25 యార్డుల దూరం నుంచి బంతిని నేరుగా గోల్ పోస్టులోకి పంపాడు. అద్భుతమైన ఈ షాట్ తో పోర్చుగల్ ఖాతాలో ఓ గోల్ పడింది. అయితే ఫ్రాన్స్ మాత్రం ఎంత చెమటోడ్చినా సింగిల్ గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో 1-0 తేడాతో పోర్చుగల్ విజేతగా నిలిచింది. తొలిసారి పోర్చుగల్ విజేతగా నిలవడంతో ఆ దేశ అభిమానులు అటు స్టేడియంలోనే కాకుండా ఇటు బయట కూడా సంబరాలను హోరెత్తించారు. అదే సమయంలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగడమే కాకుండా ఫైనల్ కు చేరిన ఫ్రాన్స్ జట్టే విజేతగా నిలుస్తుందన్న అంచనాలతో స్టేడియానికి భారీగా తరలివచ్చిన ఆ దేశ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

More Telugu News