: ఈ బ్యాక్టీరియా సోకితే 24 గంటల్లోనే మృత్యువు కబళిస్తుందట!

‘బుర్కొల్ డీరియా సుడోమెలై’ అనే బ్యాక్టీరియా కనీసం సోకినట్లు కూడా తెలియకుండానే మనిషి ప్రాణాలను 24 గంటల్లో తీసేస్తుంది... ఈ విషయాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. అతిభయంకరమైన ఈ బ్యాక్టీరియాను పరిశోధకులు ఇటీవలే గుర్తించారు. ‘బుర్కొల్ డీరియా సుడోమెలై’ సోకిన గాలిని పీల్చితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో ప్రాణాలు పోవడం ఖాయమని గ్రిఫిత్, బాండ్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. అంతుచిక్కని ఈ బ్యాక్టీరియా ఉత్తర ఆస్ట్రేలియా, దక్షిణాసియాల్లోని మట్టి నేలల నుంచి ఉద్భవిస్తోందన్నారు. నేల పొడిగా ఉన్నప్పుడు అడుగుభాగంలో ఉండే బ్యాక్టీరియా, తడి చేరగానే నేలపైకి వస్తుందన్నారు. ఈ బ్యాక్టీరియా మనిషి ముక్కుద్వారా లోపలికి వెళ్లి, నరాల ద్వారా మెదడుకు చేరుకుని, నాడీ వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా మనిషి చనిపోయేలా చేస్తుందని పరిశోధకులు వివరించారు. ఈ బ్యాక్టీరియా మనకు సోకినట్లు కూడా తెలియదని.. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి మామూలు లక్షణాలు కనబడతాయని చెప్పారు. ఈ బ్యాక్టీరియాను ఎలుకలపై ప్రయోగించి పరిశోధనలు చేస్తున్నామని, ‘బుర్కొల్ డీరియా సుడోమెలై’ గురించి త్వరలోనే క్షుణ్ణంగా తెలుసుకుంటామని, దీని బారి నుంచి బయటపడే చికిత్స పద్ధతులను కూడా కనిపెడతామని గ్రిఫిత్, బాండ్ యూనివర్శిటీ పరిశోధకులు పేర్కొన్నారు.

More Telugu News