: ఇంకా బతకాలని ఉంది... ఈ విమర్శలు వింటే చచ్చిపోతానని భయమేస్తోంది: వింబుల్డన్ విజేత ఆవేదన

ఫ్రాన్స్ మహిళా టెన్నిస్ స్టార్ మారియా బర్తోలీ తనపై వస్తున్న విమర్శలపై ఆందోళన వెలిబుచ్చింది. 2013 వింబుల్డన్ విజేత అయిన బర్తోలీ అప్పట్లో 60 కేజీల బరువుండేది. గత మూడు నెలల కాలంలో ఆమె 25 కేజీల బరువు తగ్గింది. భారీగా బరువు కోల్పోవడంతో ఆమె డైటింగ్ చేస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఘన పదార్థాలు తీసుకోకపోవడంతో ఇలా తయారైందని, ఆమెకు ఆహార సమస్యలు ఉన్నాయన్న విమర్శలు పెరిగిపోయాయి. తనకు ఆహారపదార్థాలతో సమస్య లేదని భారత్ లో భయంకరమైన వైరస్ సోకి ఇలా తయారయ్యానని విమర్శలు చేసేవారందరికీ ఎలా చెప్పగలనని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకొందరి వ్యాఖ్యలు వింటే నిజంగానే చచ్చిపోతానేమోనని భయం కూడా వేసిందని, తనకు ఇంకా బతకాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. తన జీవితంలో మిగిలినవన్నీ చీకటి రోజులేనని కన్నీరు పెట్టుకుంది. అవసరాలన్నింటికీ మినరల్ వాటరే వాడుతున్నానని, బాక్టీరియా భయంతో గాడ్జెట్స్ కూడా వాడడం మానేశానని, ఇక ఆభరణాల సంగతే ఎత్తడం లేదని బర్తోలీ చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెంచ్ ఓపెన్ కోసం జూనియర్లకు టెక్నిక్స్ చెప్పిన బర్తోలీ, ఆస్ట్రేలియా ఓపెన్ కోసం సిడ్నీ బయల్దేరింది. కామెంటేటర్ గా పనిచేసి న్యూయార్క్ వెళ్లింది. అక్కడి నుంచి వస్తుండగా నిస్సత్తువుగా అనిపించి వైద్యులను సంప్రదిస్తే వైరస్ సోకిందని తేల్చారని చెప్పింది. వారి మెడిసిన్ తనను రికవరీ చేస్తుందన్న నమ్మకం లేదని ఆమె పేర్కొంది.

More Telugu News