: ఫైనల్ కి చేరిన యూరోకప్...ఫైనల్ లో ఫ్రాన్స్, పోర్చుగల్

ఫ్రాన్స్ సత్తాచాటింది. నేటి తెల్లవారు జామున జర్మనీతో జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ సత్తాచాటింది. 1984 యూరోకప్ విజేతగా నిలిచిన ఫ్రాన్స్ అగ్రశ్రేణి జట్టుగా కితాబులందుకున్నప్పటికీ టైటిల్ విజేతగా మారలేదు. ఈ సారి యూరోకప్ కు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్...సొంత అభిమానుల సమక్షంలో రెచ్చిపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి వరుస దాడులతో జర్మనీ రక్షణ శ్రేణిలోకి చొచ్చుకెళ్లి గోల్ కొట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 45వ నిమిషంలో లంభించిన పెనాల్టీని ఫ్రాన్స్ ఫార్వార్డ్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్ మన్ సద్వినియోగం చేశాడు. దీంతో తొలి గోల్ సాధించిన ఫ్రాన్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలిగోల్ అందించిన ఉత్సాహంతో ఫ్రాన్స్ పదేపదే జర్మనీ గోల్ పోస్టుపై దాడులు చేసింది. ఈ సందర్భంగా పలు అవకాశాలను ఆ జట్టు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. తరువాత 75వ నిమిషంలో మరోసారి గ్రిజ్ మన్ జర్మనీ గోల్ పోస్టులోకి బంతిని పంపి ఫ్రాన్స్ ను స్పష్టమైన ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అప్పుడు తేరుకున్న జర్మనీ ఆటలో దూకుడు పెంచింది. ఫ్రాన్స్ రక్షణ శ్రేణిలోకి పదేపదే బంతిని గోల్ పోస్టులోకి తీసుకెళ్లినప్పటికీ ఫ్రాన్స్ డిఫెన్స్ చాకచక్యం ముందు వారి పాచికలు పారలేదు. దీంతో రెండు దశాబ్దాల అనంతరం ఫ్రాన్స్ జట్టు ఫైనల్ లో ప్రవేశించింది. ఆదివారం అర్ధరాత్రి (అంటే సోమవారం తెల్లవారు జామున) జరగనున్న పైనల్ మ్యాచ్ లో పోర్చుగల్ ను ఫ్రాన్స్ ఢీ కొంటుంది. అత్యుత్తమ ఫాంలో ఉన్న క్రిష్టియానో రొనాల్డోను ఫ్రాన్స్ డిఫెన్స్ విభాగం ఎలా అడ్డుకుంటుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్ ఫుట్ బాల్ అభిమానులకు నేత్రపర్వమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

More Telugu News