: ఉగ్రవాదంపై ఉక్కుపాదం... 12 మంది పాక్ జాతీయులను అరెస్ట్ చేసిన సౌదీ

వరుస ఉగ్రదాడులతో వణికిపోతున్న సౌదీ అరేబియా కఠిన చర్యలను ప్రారంభించింది. సోమవారం నాటి మూడు దాడుల తరువాత విస్తృతంగా సోదాలు జరిపిన సౌదీ దళాలు ఉగ్రవాదులన్న అనుమానాలతో 12 మంది పాక్ జాతీయులు సహా మొత్తం 19 మందిని అదుపులోకి తీసుకున్నాయి. రంజాన్ వేడుకలకు ముందు మదీనాపై దాడి జరుగగా, నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. అమెరికా కాన్సులేట్ ముందు మరో దాడి జరిగిన సంగతి తెలిసిందే. వీటన్నింటినీ సీరియస్ గా తీసుకున్న సౌదీ రాజు, తక్షణం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మదీనాపై దాడికి కుట్ర జరిపింది డ్రగ్స్ కు బానిసగా మారిన 26 ఏళ్ల సౌదీ జాతీయుడు నయీర్ మోస్లెమ్ హమద్ అల్ బలావిగా తేల్చారు. ఆపై 23 ఏళ్ల అదీర్ రెహమాన్ సలేహ్ మహమ్మద్ అల్ అమీర్ అనే యువకుడు మరో దాడికి కారకుడని, జెడ్డాపై దాడి చేసిన వ్యక్తి పాక్ కు చెందిన అబ్దుల్లా ఖల్జార్ ఖాన్ అని వెల్లడించారు. ఇక ఈ దాడులకు తామే బాధ్యులమని ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోనప్పటికీ, ప్రపంచంలోనే ముస్లింలకు రెండో ప్రధాన ప్రార్థనాలయంగా ఉన్న మదీనాపై దాడిని సౌదీ తేలికగా తీసుకోలేదు. ఇస్లాం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త సమాధి సమీపంలో దాడిని తట్టుకోలేక పోతున్న సౌదీ, ఇకపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాను ఉగ్రరహితంగా మారుస్తామని రాజు అబ్దుల్లా ప్రజలకు అభయమిచ్చాడు. ఈ నేపథ్యంలోనే దాడులు, అనుమానితుల అరెస్టులు జరుగుతున్నాయి.

More Telugu News