: బ్రిటన్ ను వీడుతున్న జేపీ మోర్గాన్!

బ్రిటన్ లో 16 వేల మందికి ఉపాధిని కల్పిస్తూ, లండన్, బౌర్నేమౌత్, స్కాట్లాండ్ లలోని తన ఇతర కార్యాలయాలను కలిగివున్న ప్రముఖ బ్యాంకింగ్, ఆర్ధిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, ఆ దేశాన్ని వీడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. లండన్ లో కేంద్ర కార్యాలయం ఉంటే, అక్కడి నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు ఆర్థిక సేవలను విక్రయించే హక్కును తాము కోల్పోతామన్నదే జేపీ మోర్గాన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. గత నెలలో బ్రెగ్జిట్ పై రెఫరెండం తరువాత తాము ఈయూలోని మరో దేశాన్ని కేంద్రంగా చేసుకునేందుకు ప్రణాళికలు ప్రారంభించినట్టు బ్యాంకు సీఈఓ జెమీ డిమాన్ ఓ ఇటలీ దినపత్రికకు తెలియజేశారు. తాము బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు సేవలందించేందుకు సహకరించిన 'పాస్ పోర్ట్ రూల్', ఇకపై తమకు ప్రధాన సమస్య కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక బ్రిటన్ పై ఈయూ ఏవైనా కఠిన నిబంధనలను విధిస్తే, ఇక్కడి నుంచి కొన్ని వేల మందిని మరో దేశానికి తరలించి, అక్కడ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కాగా, యూరప్, మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాల నుంచి జేపీ మోర్గాన్ గతేడాది 14.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకుంది.

More Telugu News