: బుద్ధుడి అవశేషం దొరికిందంటున్న చైనా పురావస్తు శాస్త్రవేత్తలు

చైనాలోని నాంజింగ్ నగరంలోని ఓ బౌద్ధాలయంలో 2010లో గౌతమ బుద్ధుడి అవశేషాలు దొరికాయని చైనా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడెప్పుడో దొరికితే ఇప్పటి వరకు ప్రపంచానికి ఎందుకు తెలియనీయలేదన్న ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే, వెయ్యి ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఎర్రచందనం, బంగారం, వెండితో తయారు చేసిన నాలుగు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల బాక్సులో గౌతమ బుద్ధుడి కపాలంలోని ఓ పార్శపు ఎముక, ఇతర బౌద్ధ సన్యాసుల అవశేషాలు లభ్యమయ్యాయని ఓ చైనా పత్రిక వెల్లడించింది. ఈ బాక్సుతో పాటు దొరికిన రాతి ఫలకం మీద ఆలయాన్ని నిర్మించిన వారి పేరుతోపాటు అవశేషాలున్న వారి పేర్లను కూడా చెక్కారని ఈ పత్రిక కథనం తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు ఉన్నాయని వారు తెలిపారు. అవేంటంటే...హిరన్నవతి నదీ తీరం వద్ద బుద్ధుడి అంత్యక్రియలు జరిగాయని, అప్పుడు సేకరించిన ఆయన ఎముకల్లో 19 ఎముకలు చైనాకు చేరాయని ఆ శిలాఫలకంపై ఉన్న రాతల ద్వారా తెలుస్తోంది. 11వ శతాబ్దానికి చెందిన జెంగ్‌ జాంగ్ అనే రాజు అప్పటికే శిథిలమైన ఆలయం చోట ఈ బుద్ధుడి అవశేషాలున్న బాక్సును, శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి బౌద్ధాలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఈ కథనం వెల్లడించింది.

More Telugu News