: పదేళ్ల చిచ్చరపిడుగు...ఘనాపాటీలకు సాధ్యం కాని ఫెలోషిప్ ను సొంతం చేసుకుంది!

రోబోటిక్స్ లో నిపుణులు కావాలంటే పెద్దపెద్ద చదువులు చదవాలి. తరువాత రకరకాల కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఇవేమీ చేయకుండానే పారిస్ కు చెందిన పదేళ్ల చిన్నారి గొప్పగొప్ప విద్యావంతులకు సైతం సాధ్యం కాని పీహెచ్డీ ఫెలోషిప్ ను సాధించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళ్తే...ఫ్రాన్స్ కి చెందిన పదేళ్ల ఇవాకి పారిస్ వీధులన్నీ బోసిగా కనిపించాయట. స్ట్రీట్ ఆర్ట్ తో వీధులను సుందరంగా తీర్చిదిద్దితే బాగుంటుందని భావించిన ఇవా, అందుకు రోబోలను వినియోగించాలని యోచించింది. ఇందుకోసం 'తిమియో రోబోటిక్స్' కోడింగ్ కోర్సు కూడా నేర్చుకుంటోంది. ఇదే సమయంలో 'ఫైవ్ బై ఫైవ్' అనే డిజిటల్ ఏజెన్సీ సమ్మర్ ఇన్నోవేషన్ కోర్సుకి దరఖాస్తులు ఆహ్వానించింది. దీనిని అవకాశంగా తీసుకున్న ఇవా, పారిస్ వీధులు అస్సలు బాలేవు, వీధులను అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నా, అందుకోసం రోబోలును వినియోగించాలి, దాని కోసం రోబోటిక్స్ కోర్సు కూడా నేర్చుకుంటున్నా, అయితే వాటితో ఎలా పని చేయించాలో తెలియడం లేదు. అందుకే మీ ప్రోగ్రాంలో చేరాలనుకుంటున్నానని దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తుతో పాటు రోడ్డుపై నక్షత్రం బొమ్మను గీసే రోబోను రూపొందించిన వీడియోను జత చేసి పంపింది. అది ఆ ఏజన్సీ వారిని బాగా ఆకట్టుకుంది. పదేళ్ల పిల్లలకు ఫెలోషిప్ మంజూరు చేసేందుకు అనుమతి లేకున్నప్పటికీ ఇవా ఆసక్తి గమనించి, ఆమెకు ఫెలోషిప్ అందజేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.

More Telugu News