: ముస్లింలు కాదని నిర్ధారించుకుని మరీ బరి తెగింపు!... వెలుగులోకి వచ్చిన ఢాకా ‘ఉగ్ర’దాడి సీసీటీవీ ఫుటేజీ!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని దౌత్య కార్యాలయాల కూడలి గూల్షాన్ లోని హోలి ఆర్టిసన్ బేకరి రెస్టారెంట్ పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు కరుడుగట్టిన మత ఛాందసవాదులని తేలిపోయింది. బేకరిలో బందీలుగా పట్టుకున్న వారిని చంపేసే క్రమంలో ఉగ్రవాదులు తమ నిజ స్వరూపాన్ని చాటుకున్నారు. బందీలుగా పట్టుకున్న వారిలో ముస్లింలు అని నిర్ధారించుకున్న వారికి ఏమాత్రం కీడు చేయకుండా వదిలేసిన ఉగ్రవాదులు... ముస్లింలు కాదని నిర్ధారించుకున్న వారిని కత్తులతో కుత్తుకలు కోసి మరీ చంపేశారు. ఈ మేరకు బేకరిలో పది గంటలకు పైగా జరిగిన దారుణ మారణ కాండను ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు వెల్లడించాడు. ఇక బేకరిపై ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దాడి చేయకముందు దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వీడియోలో బేకరి ప్రాంగణంలోని పచ్చిక బయలులో బందీలను వెంటబెట్టుకుని వెళుతున్న ఉగ్రవాది... వారిని ఆపి ఖురాన్ పంక్తులు చెప్పాలని ఆదేశాలు జారీ చేశాడు. ఆ తర్వాత వారిని లోపలికి తీసుకెళుతున్న దృశ్యాలు ఆ ఫుటేజీలో ఉన్నాయి.

More Telugu News