: ఢాకాలో ఉగ్రవాదుల చెర నుంచి 13 మంది బందీలను విడిపించిన భద్రతా బలగాలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల చెరనుంచి 13 మంది బందీలను భద్రతా బలగాలు విడిపించాయి. వీరిలో ఒకరు భారతీయుడు కాగా మిగతావారు బంగ్లాదేశీయులు. బందీలను రక్షించేందుకు దాదాపు వందమంది కమాండోలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టారు. ఈ ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభమైనట్టు అధికారులు ప్రకటించారు. రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న కమాండోలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఇరువురి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. లోపలికి చొచ్చుకెళ్లిన భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల చెరలో ఉన్న వారినుంచి 13 మందిని రక్షించగలిగారు. బయటపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరు గాయాలపాలై ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతం సమీపంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ రావద్దని, అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మిగతా బందీలను విడిపించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది.

More Telugu News