: ఒకే ఒక్క ప్రయాణికుడితో వెళ్లిన విమానం.... గొప్ప అనుభూతి అంటున్న ప్యాసింజర్!

ఈ విమాన ప్రయాణం ప్రపంచ వింతగా చెప్పచ్చు. ఎందుకంటే, 160 మంది ప్రయాణికులు ప్రయాణం చేయాల్సిన విమానంలో ఒకే ఒక్కడు ప్రయాణించాడు. ఆ విమానయాన సంస్థ కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా సదరు ప్రయాణికుడిని తన గమ్యస్థానానికి చేర్చింది. అమెరికాలోని జార్జియాలో ఉన్న లారెన్స్ విల్లేకు చెందిన స్టీవెన్ షెనీడెర్ ఎండీ -90 అనే డెల్టా ఎయిర్ లైన్స్ లో అట్లాంటా వెళ్లేందుకు గతవారం ప్లాన్ చేసుకున్నాడు. న్యూఓర్లీన్స్ లోని విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, కాసేపటికి మిగిలిన ప్రయాణికులెవరూ కనపడకపోవడంతో అనుమానం వచ్చిన స్టీవెన్ అక్కడి అధికారులను అడిగాడు. స్టీవెన్ ప్రయాణించాల్సిన విమానం ఆలస్యం అవుతుందని చెప్పడంతో, కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోగా, మరికొందరు వేరే విమానంలో వెళ్లిపోయారని చెప్పారు. ‘మీరు వెళతారా? లేక వెయిట్ చేస్తారా? అని స్టీవెన్ ను ఎయిర్ లైన్స్ అధికారులు ప్రశ్నించడంతో, మొదట కొంచెం అయోమయానికి గురైన స్టీవెన్, తర్వాత ‘వెయిట్’ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత డెల్టా ఫ్లయిట్ అంటెండెంట్ ఒకరు స్టీవెన్ వద్దకు వచ్చి మీరొక్కరే ఉన్నారని, మరుసటి రోజు విమాన సర్వీసులో రావాలని కోరింది. అయితే, ఆ తర్వాత కొంచెం సేపటికే విమానం బయలుదేరుతోందని, రమ్మంటూ స్టీవెన్ కు పిలుపు వచ్చింది. తీరాచూస్తే, ఆ విమానంలో తానొక్కడే వున్నాడు. ఎంచక్కా, ఒక్కడే హాయిగా ఆ విమానంలో ప్రయాణం చేశాడు. ఈ విషయమై స్టీవెన్ మాట్లాడుతూ, ఈ ప్రయాణం తన జీవితంలో మరువలేని అనుభూతి అని చెప్పాడు.

More Telugu News