: అడుగు దూరంలో మృత్యువును చూసిన హనీమూన్ కపుల్!

పక్కనే తుపాకుల మోత, విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న ముష్కరులు. ఒక్కొక్కరుగా నేలకు ఒరుగుతున్న తోటివారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వందేళ్లు కలసి సాగాల్సిన తమ వివాహ బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలి, హనీమూన్ రాత్రే ఆఖరి రాత్రిగా మారుతుందేమోనన్న భయం ఆ జంటకు పట్టకుంది. ప్రాణాలు మిగిలితే చాలన్న కోరికతో ఎలాగోలా తప్పించుకుని, స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు చేసిన వేళ, అమెరికాకు చెందిన కొత్త దంపతులు స్టీవెన్ నబీల్, నార్మిన్ లకు ఎదురైన అనుభవమిది. కొత్తగా పెళ్లయిన ఈ జంట వారం రోజుల హనీమూన్ కోసం టర్కీ వచ్చి, న్యూయార్క్ కు తిరుగు ప్రయాణంలో భాగంగా అటాటర్క్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. "నల్లని దుస్తుల్లో ఉన్న ఓ సాయుధుడు ఎంట్రీ పాయింట్ వద్దకు ఏకే-47తో వచ్చి, కాల్పులు ప్రారంభించాడు. రంజాన్ ఉపవాస దీక్షను ముగించి, ఆహారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నవారిపై కాల్పులు మొదలు పెట్టాడు. నాకు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు. చిన్నా, పెద్దా, ఆడా, మగా అన్న తేడా చూడటం లేదు. ఆ సమయంలో గుండె ఆగిపోయింది. నా భార్యను కాపాడుకోవడానికి చాలా తంటాలు పడ్డాను. ఓ బారికేడ్ వెనుక దాక్కున్నాం. నా భార్యకు బులెట్ గాయమైంది. బిగ్గరగా కేకలు పెట్టవద్దని సూచించాను. ఓ పావుగంట పాటు కాల్పులు జరిపి, ఆపై ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు" అని స్టీవెన్ వెల్లడించాడు.

More Telugu News