: సిగ్గుచేటు, ఎవరెస్ట్ ఎక్కకుండానే మార్ఫింగ్ ఫోటోలతో పేరు తెచ్చున్న పోలీసు జంట... విచారణకు ఆదేశం!

దినేష్, తారకేశ్వరీ రాథోడ్... మూడు వారాల క్రితం ఎవరెస్ట్ ను అధిరోహించి వచ్చిన తొలి జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ జంటగా ఉన్న వీరిద్దరికీ మంచి మీడియా కవరేజ్ కూడా లభించింది. 'సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్' పేరిట సదస్సు జరుగగా, దానికి వెళ్లిన వీరు, అక్కడి నుంచి ఎవరెస్ట్ ఎక్కగా, శిఖరంపై వీరు దిగిన చిత్రాలను దాదాపు అన్ని పత్రికలూ ప్రచురించి, వీరిద్దరినీ ఆకాశానికి ఎత్తేశాయి. ఇప్పుడు దినేష్, తారకేశ్వరీలు అదే ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలపై పడ్డారు. కారణం, అసలు వీరిద్దరూ ఎవరెస్ట్ ఎక్కనేలేదని, మార్ఫింగ్ ఫోటోలతో ప్రచారం చేసుకున్నారని తేలడమే. అదే సదస్సుకు మహారాష్ట్ర నుంచి వెళ్లిన పలువురు పర్వతారోహకులు, దినేష్ దంపతులు అసలు సదస్సుకే రాలేదని, మహారాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పుణె పోలీసు కమిషనర్ రష్మీ శుక్లా దీనిపై విచారణకు ఆదేశించారు. ఇదే విషయమై స్పందించేందుకు తారకేశ్వరి నిరాకరించారు. పోలీసు విచారణలో అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని అన్నారు. కాగా, తాము మే 23న ఎవరెస్ట్ ఎక్కామని ఈ జంట చెప్పుకోగా, జూన్ 6న దేశవ్యాప్తంగా పత్రికలు వీరిని కొనియాడుతూ చిత్రాలను ప్రచురించాయి. మహారాష్ట్ర పోలీసు బాస్ లు వీరిని ప్రత్యేకంగా అభినందించారు కూడా. జూన్ 16న వీరిద్దరూ ఎవరెస్ట్ ఎక్కనే లేదని అంజలీ కులకర్ణి, శరద్ కులకర్ణి, సురేంద్ర షల్కే, ఆనంద్ బన్సోడే తదితర పర్వతారోహకులు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన అధికారులు 27న స్టేట్ మెంట్లను రికార్డు చేశారు.

More Telugu News