: ఆంగ్లంపై నిషేధం విధించనున్న యూరోపియన్ యూనియన్!

బ్రెగ్జిట్ పై యూకే వాసులు ఇచ్చిన తీర్పు, యూరప్ లో ఆంగ్ల భాషకు చేటు తెచ్చి పెట్టనుంది. మొత్తం 28 దేశాలు సభ్యులుగా ఉన్న యూరోపియన్ యూనియన్ లో ఒక్క దేశం ఒక్కో అధికార భాషను కలిగివున్న వేళ, యూనియన్ సమావేశాల్లో ఇప్పటివరకూ ఆంగ్ల భాష అధికారికంగా ఉంది. ఇక ఇప్పుడు యూకే వైదొలగితే, ఇంగ్లీషు భాషను కూడా తొలగించాలని, ఈ మేరకు ఆంగ్ల నిషేధం విధించాలని మిగతా దేశాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. "యూనియన్ లోని ప్రతి దేశమూ, తమ సభ్యులు వాడే ఓ అధికార భాషను నోటిఫై చేయాల్సి వుంటుంది. ఇంగ్లీషు అధికార భాషగా చెప్పే ఒక్క సభ్యుడు కూడా లేని వేళ ఆ భాషను అఫీషియల్ గా వాడటం ఎందుకు?" అని పోలాండ్ నుంచి యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన డనుటా హబ్నర్ ప్రశ్నించారు. ఇంగ్లీషును యూకే మాత్రమే నోటిఫై చేసిందని, ఈయూలోని మరే దేశమూ ఆంగ్లాన్ని ప్రాథాన్య భాషగా గుర్తించలేదని తెలిపారు. యూకే వెళ్లిపోతే, మిగతా 27 దేశాలూ మరో అధికార భాషను ఎన్నుకుంటాయని తెలిపారు. యూనియన్ లో ఫ్రెంచ్, జర్మన్ సహా 24 భాషలను ప్రతినిధులు మాట్లాడుతుంటారని వివరించారు. కాగా, తదుపరి ఈయూ అధికార భాషగా జర్మన్, ఫ్రెంచ్ భాషల మధ్యే అధిక పోటీ ఉంటుందని అంచనా.

More Telugu News