: ఆ 42 మందిని చంపింది మేమే: ఐఎస్ఐఎస్

యమన్ దళాలే లక్ష్యంగా సోమవారం ముకల్లా‌లో జరిగిన ఉగ్రదాడిలో 42 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి తమ పనేనని, 8 మంది ఆత్మాహుతి దళ సభ్యులు దాడిలో పాల్గొన్నారని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐస్ ప్రకటించింది. ఈ ఘటనలో మొత్తం 50 మంది సైనికులు మరణించారని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం 42 మందే మరణించారని, దాడిలో పాల్గొన్నది ఐదుగురు ఉగ్రవాదులేనని తెలిపింది. హద్రామవట్ ప్రావిన్స్ రాజధాని అయిన ముకల్లా దాదాపు ఏడాది పాటు అల్ ఖాయిదా నియంత్రణలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తిరిగి ముకల్లాను చుట్టుముట్టడంతో అది ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. కాగా నిన్న జరిగిన తొలి దాడిలో మోటార్ బైక్‌పై వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఉపవాస దీక్ష విరమించేందుకు సిద్ధమవుతున్న సైనికుల వద్దకు వెళ్లి తాను కూడా వారితో కలిసి భోజనం చేస్తానని చెప్పి తనను తాను పేల్చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు సైనికుల ముందు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనల్లో మొత్తం 42 మంది సైనికులు మృతి చెందగా 37 మంది పౌరులు గాయపడ్డారు. ముకల్లాపై మళ్లీ పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్న అల్‌ఖాయిదా ఇప్పటికే పలు పట్టణాలను తన అధీనంలోకి తెచ్చుకుంది.

More Telugu News