: ఒడిదుడుకుల మధ్య ఎటూ కదలని మార్కెట్

బ్రెగ్జిట్ ప్రభావంతో భారీ నష్టాల తరువాత, ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉండటంతో, తీవ్ర ఒడిదుడుకుల మధ్య బెంచ్ మార్క్ సూచికలు స్థిరంగా కొనసాగాయి. సెషన్ ఆరంభంలోనే నష్టాల్లోకి జారిన సెన్సెక్స్, నిఫ్టీలు ఆపై పలుమార్లు లాభాల్లోకి, అమ్మకాలతో నష్టాల్లోకి జారిపోయాయి. యూరప్ మార్కెట్ల నష్టాలు మరోసారి ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఇదే సమయంలో స్మాల్, మిడ్ క్యాప్ సెక్టార్ల కంపెనీలను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే, చిన్న కంపెనీలు మెరుగైన లావాదేవీలను నమోదు చేశాయి. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 5.25 పాయింట్లు పెరిగి 0.02 శాతం లాభంతో 26,402.96 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 6.10 పాయింట్లు పెరిగి 0.08 శాతం లాభంతో 8,094.70 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.80 శాతం లాభపడగా, స్మాల్ కాప్ 1.52 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, అల్ట్రా సిమెంట్ కంపెనీ, అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, జడ్ఈఈఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,786 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,820 కంపెనీలు లాభాలను, 788 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,00,13,695 కోట్లకు చేరుకుంది.

More Telugu News