: రెగ్జిట్, బ్రెగ్జిట్, మెస్సీ ఎగ్జిట్... ప్రపంచాన్ని షాకింగ్ కు గురిచేసిన 3 ఈవెంట్లు నేర్పుతున్న 5 పాఠాలివి!

గడచిన వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనలు ప్రపంచాన్ని షాక్ నకు గురి చేశాయి. ఈ మూడూ వేర్వేరు దేశాలకు సంబంధించినవే అయినా, మూడూ ఊహించనివే. ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ అనుకోని విధంగా వచ్చి పడ్డవే. వీటిల్లో మొదటిది రెగ్జిట్ (రాజన్ ఎగ్జిట్) ఆర్బీఐ గవర్నరుగా తాను రెండో విడత బాధ్యతలు చేపట్టేది లేదని రాజన్ ప్రకటించారు. ఆపై ప్రతి ఒక్కరి అంచనాలను తలకిందులు చేస్తూ, యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సిందేనని బ్రిటన్ వాసులు బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఓటేసి, తాము స్వతంత్రాన్ని కోరుతున్నామని చెప్పారు. ఇక మూడవది నేడు జరిగింది. ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో తనకంటూ ఎంతో గుర్తింపును తెచ్చుకున్న స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆట నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం. ఈ నిర్ణయం కోట్లాది మంది అభిమానులను షాక్ కు గురి చేసింది. ఈ మూడు సంఘటనలు పెట్టుబడిదారులు అనిశ్చిత స్థితిలో ఉన్నారని గుర్తు చేస్తూ కొన్ని పాఠాలను చెబుతున్నాయి. వీటిల్లో మొదటిది ఈ తరహా కష్టాలు వచ్చినప్పుడు, ఆ వెంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రెండోది ఇవి ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచి తప్పుడు నిర్ణయాల దిశగా నడిపిస్తాయి. అవకాశాలను అందుకోవడం ఎంత లాభాన్ని కలిగిస్తుందో, తప్పుడు నిర్ణయాలు అంతే నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివి. * ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి: ఆర్థిక మార్కెట్లలో అసంతృప్తి ఎన్నడూ ఉండరాదు. మీరొక ఇన్వెస్టర్ అయితే, వీటిని ఓ హెచ్చరికగా మాత్రమే తీసుకోవాలి. ఇవన్నీ పోర్ట్ ఫోలియో, పెట్టుబడుల నిర్ణయాలపై ప్రభావం చూపేవే. పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతనే నిర్ణయాలు తీసుకోవాలి. పక్కవారు అమ్ముతున్నారని అడుగులు వేస్తే, లాభం కన్నా నష్టమే మిగులుతుంది. ఈ పరిస్థితుల్లో ఓపిక అవసరం * వివిధీకరణ ఎంతో ముఖ్యం: పెట్టుబడి అంతా ఒకే చోట ఉంచరాదు. ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడులు, సేవింగ్స్ ను బ్యాంకుల నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకూ, ఈక్విటీల నుంచి బులియన్ వరకూ, జీవిత బీమా నుంచి క్రిటికల్ ఇల్ నెస్ వరకూ వివిధ విభాగాల్లో పంచుకుంటూ సాగాలి. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ నకు లోబడి వుంటాయి కాబట్టి ఇతర మార్గాల్లోనూ కొంత ఇన్వెస్ట్ ఉంచడం ముఖ్యం. * క్రమశిక్షణ, క్రమానుగుణ పెట్టుబడులు: పెట్టుబడులు పెట్టేటప్పుడు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజర్ సచిన్ షా వెల్లడించారు. ఈక్విటీలను ఎంచుకుంటే సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్) ఎంతో మేలని సలహా ఇచ్చారు. డైరెక్టుగా ఓ కంపెనీని ఎంచుకోకుండా, దాని గురించి కొంత రీసెర్చ్ చేసి పరిశీలించి రంగంలోకి దిగితేనే దీర్ఘకాలంలో లాభపడొచ్చు. రెగ్జిట్, బ్రెగ్జిట్ వంటివి చూపే ప్రభావం తాత్కాలికమే. దలాల్ స్ట్రీట్ లో ఏ సీనియర్ ఇన్వెస్టర్ ను అడిగినా దీని గురించి చెబుతారు. ఒకసారి పెట్టుబడి పెట్టిన తరువాత, అది ఎంత ధరలో ఉందన్న విషయాన్ని మరచిపోవాలి. తిరిగి డబ్బు అవసరమై వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే విక్రయించుకోవాలి. * చేతిలో కొంత నగదు: అవకాశాలు ఎప్పుడు తలుపు తడతాయో ఎవరూ ఊహించలేరు. దాన్ని అందుకునేందుకు నిత్యమూ సిద్ధంగా ఉండాలి. అందుకు చేతిలో కొంత నగదు ఉండాలి. మొత్తంమీద పోర్ట్ ఫోలియోలో కనీసం 30 శాతం నగదు రూపంలో నిత్యమూ అందుబాటులో ఉంటే మంచిదని అలియన్జ్ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ మహమ్మద్ అల్ ఇరియన్ వివరించారు. * పరిమితులు విధించుకోవాలి: ఎక్కడ పెట్టుబడి పెట్టినా లాభ నష్టాలపై పరిమితులు విధించుకుంటే ఈ తరహా పరిస్థితులు ఏర్పడినప్పుడు మరింత నష్టం కలుగకుండా ఉపకరిస్తాయి. పరిమితులతో కూడిన లాభ నష్టాలకు సిద్ధపడితే, రిస్క్ గణనీయంగా తగ్గుతుంది.

More Telugu News