: హైదరాబాద్ కంటే సౌకర్యంగా ఉందంటూ, సొంతింట్లో సందడి చేస్తున్న ఉద్యోగులు!

హైదరాబాద్ నుంచి కార్యాలయాల తరలింపులో భాగంగా అమరావతి ప్రాంతానికి చేరుకున్న వివిధ విభాగాల ఉద్యోగులు ఇప్పుడు సొంతింటికి వచ్చినట్టు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రాంతానికి చేరుకున్న ఉద్యోగులకు మంత్రులు ఘన స్వాగతం పలికి మిఠాయిలు తినిపించారు. ఆపై తమ తమ కార్యాలయాల భవనాలను కలయదిరిగి చూసుకున్న ఉద్యోగులు, హైదరాబాద్ లోని ఇరుకు ఆఫీసుల కన్నా విజయవాడలో విశాలంగా, సౌకర్యవంతంగా భవంతులు ఉన్నాయని వ్యాఖ్యానించారట. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పిన ఆయన, ఉద్యోగులకు సౌలభ్యంగా ఉండేలా నెల రోజుల పాటు ఉచితంగా వసతి, భోజన ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. కాగా, నేడు భారీ సంఖ్యలో నూతన ఆఫీసుల ప్రారంభోత్సవాలు వైభవంగా జరిగాయి. కరెన్సీ నగర్ లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల కమిషనర్ ఆఫీసు, బెంజ్ సర్కిల్ లో ట్రెజరీ డైరెక్టరేట్, పే అండ్ అకౌంట్స్ కార్యాలయం మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు స్వరాష్ట్రం నుంచే పాలన సాగాలన్న ఆకాంక్షను తాము శ్రమించి నెరవేరుస్తామని ఉద్యోగులు వెల్లడించారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, క్రమేపీ అన్నీ తొలగుతాయని భావిస్తున్నామని పలువురు చెబుతుండగా, విజయవాడకు వస్తే సొంత ఇంటికి వచ్చినట్టుందని అత్యధికులు, ఇక రోజూ ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చి పోవచ్చని గుంటూరు ప్రాంత ఉద్యోగులు ఆనందంగా ఉన్నారు.

More Telugu News