: మద్యం మత్తులో తుపాకితో బెదిరించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్... చితక్కొట్టి పోలీసులకు అప్పగింత!

ఐటీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన సాత్విక్, తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడంతో పాటు ఓవర్ టేక్ చేసేందుకు సైడ్ ఇవ్వని బస్ డ్రైవర్ ను తుపాకితో బెదిరించినందుకు, దాదాపు 200 మంది ప్రజలు వారిని చావగొట్టి పోలీసులకు అప్పగించిన ఘటన బెంగళూరు - మైసూరు హైవేపై జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సాత్విక్ నడుపుతున్న కారుకు కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ విశ్వనాథ్ దారిని ఇవ్వలేదు. దీంతో, కొన్ని కిలోమీటర్ల తరువాత ప్రయాణికులను దించేందుకు బస్సును ఆపగా, ముందుకు దూసుకొచ్చి తన హ్యుందాయ్ ఐ20 కారును ఆపి ఎయిర్ గన్ తో డ్రైవర్ ను బెదిరించాడు సాత్విక్. ఆపై ప్రయాణికులు దిగి వారితో వాదన పెట్టుకోగా, కారులోకి వెళ్లి కూర్చుని అద్దాలు బిగించుకున్నారు. వారి కారును అడ్డుకున్న ప్రయాణికులు, స్థానిక యువకులు, టైర్లలో గాలి తీసి, అద్దాలను పగులగొట్టి వారిపై దాడి చేశారు. డ్రైవర్ విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు సాత్విక్ ను అరెస్ట్ చేశామని, కేసు దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, రోడ్డుకు రెండువైపులా వాహనాలు నిలిపి వుండటంతో తనకు దారిచ్చే అవకాశం లభించలేదన్నది డ్రైవర్ వాదన.

More Telugu News