: పాలిగ్రాఫ్ టెస్ట్‌కు జిషా హత్యకేసు నిందితుడు!

కేరళలో సంచలనం సృష్టించిన జిషా హత్య కేసు నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు సందర్భంగా నిందితుడు అమీరుల్ ఇస్లాం పరస్పర విరుద్ధ సమాధానాలు చెబుతుండడంతో ఆయనకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని అనుకున్నా కోర్టులో అది నిలిచే వీలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 28న పెరుంబవూర్‌లోని వట్లోలిపడ్డిలో నిందితుడు అమీరుల్ ఇస్లాం బాధితురాలి ఇంట్లోనే ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్యకు ఉపయోగించిన ఆయుధంపై నిందితుడు ఒక్కోసారి ఒక్కోరకంగా చెబుతున్నాడు. ఒకసారి ఆ ఆయుధాన్ని ఇరింగోల్‌కవు వద్ద విసిరేశానని, మరోసారి అస్సాంలోని తన ఊరికి పట్టుకుపోయానని చెబుతున్నాడు. తాను ఒక్కడినే జిషాను హత్యచేసినట్టు మొదట్లో అంగీకరించాడు. అయితే అనారుల్ అనే అతడి స్నేహితుడికి కూడా ఇందులో ప్రమేయం ఉందని, అతను పరారీలో ఉన్నాడని పోలీసులు మొదట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కేసులో మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు విషయం రాబట్టేందుకు నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం కోసం అస్సాం వెళ్లిన పోలీసులు తిరిగి రాగానే ఈ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News