: తాను చనిపోతూ మరో ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించిన విద్యార్థి

తాను చనిపోతూ మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చాడో 17 ఏళ్ల విద్యార్థి. ఇప్పుడు వారిలోనే తమ కుమారుడిని చూసుకుంటున్నారా తల్లిదండ్రులు. ముంబైకి చెందిన భావేష్ డిగ్గే విద్యావిహార్‌లోని కేజే సోమైయ కాలేజ్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. గతవారం కాలేజ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం స్నేహితులతో కలిసి వాడలా‌ స్టేషన్‌లో రైలు ఎక్కి ఇంటికి బయలుదేరాడు. అయితే రైలులో విపరీతమైన రద్దీ కారణంగా పట్టుతప్పిన భావేష్ వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల తర్వాత అతను బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇక చేసేదేమీ లేదని పేర్కొన్నారు. అయితే అతని అవయవాలను దానం ఇవ్వడం ద్వారా మరికొందరికి పునర్జన్మ ఇవ్వవచ్చని, తద్వారా కొడుకు బతికే ఉంటాడని భావేష్ కుటుంబ సభ్యులకు వైద్యులు వివరించారు. దీనికి వారు అంగీకరించడంతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న ఆరుగురికి ట్రాన్స్‌ప్లాంట్ చేసి భావేష్ అవయవాలను అమర్చారు. 31 ఏళ్ల మహిళకు గుండెను, లివర్‌ను 76 ఏళ్ల వృద్ధుడికి, ఓ కిడ్నీని 29 ఏళ్ల మహిళకు, మరోదానిని 42 ఏళ్ల మహిళకు అమర్చారు. అలాగే కార్నియాలను మరో ఇద్దరికి అమర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. బంగారు భవిష్యత్తు ఉన్న తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా దూరమవుతాడని ఊహించలేదని, ఇప్పుడు ఆరుగురిలో తమ కుమారుడిని చూసుకుంటున్నామని భావేష్ తల్లిదండ్రులు కన్నీరు సుడుల మధ్య పేర్కొన్నారు.

More Telugu News