: ‘బేటీ బచావో.. బేటీ పడావో’ ఐడియా నాదే.. ప్రధాని కొట్టేశారు: మహిళా పోలీస్ అధికారి సంచలన ఆరోపణ

బాలికలను కాపాడుకోవడంతోపాటు వారికి విద్యనందించే ఉద్దేశంతో గతేడాది ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘బేటీ బచావో.. బేటీ పడావో’ ఐడియా తనదేనని, కేంద్రం దానిని కొట్టేసిందని రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి సంచలన ఆరోపణ చేశారు. ప్రభుత్వం ఈ స్లోగన్‌ను ఎక్కడి నుంచి తీసుకుందో చెప్పాలంటూ ఉదయ్‌పూర్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో చేతనా భాటి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అయితే అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె ప్రధాని మోదీకి తన ప్రతిభను గుర్తించాలని కోరుతూ లేఖ రాశారు. హిస్టరీ, ఇంగ్లిష్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ అయిన భాటి, 20 ఏళ్ల క్రితం పోలీస్ ఫోర్సులో చేరకముందు ప్రభుత్వ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. ‘‘1999లో ఓ కవిత్వం కోసం ఈ పదబంధాన్ని మొట్టమొదట రాశా. 2005లో జరిగిన కార్యక్రమంలో దీనిని ప్రదర్శించా కూడా. డబ్బుల కోసమో, పేరు కోసమో ఇప్పుడు నేనీ పనిచేయడం లేదు. ఎంతో పాప్యులర్ అయిన ఈ స్లోగన్ ఐడియా నాదే అని చెబితే చాలు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మోదీ స్పందిస్తారనే అనుకుంటున్నానని భాటీ ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News