: ఇండియాకు వచ్చేందుకు ఎంతో త్యాగం చేసిన రాజన్... వచ్చి వేధింపులకు గురయ్యారు: శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు

ఇండియాకు వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టే క్రమంలో రఘురాం రాజన్, తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారని, చివరికి ఇక్కడ వేధింపులకు గురయ్యారని దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సాంకేతిక సలహాదారుగా పనిచేసిన శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపున్న ఆర్థిక నిపుణుడిపై నోటి కొచ్చినట్టు మాట్లాడారని, ఆయనే స్వయంగా ఆర్బీఐని వీడుతున్నట్టు ప్రకటించడాన్ని విని తానేమీ ఆశ్చర్య పోలేదని అన్నారు. ఆయన నిబద్ధత, జాతీయత, విశ్వసనీయతపై ఎన్నో విమర్శలు చేశారని, ఇవన్నీ ఆయన మనసుకు కష్టం కలిగించి వుండవచ్చని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న ఇండియా, రాజన్ ను దూరం చేసుకుంటే ఎంతో నష్టపోతుందని పిట్రోడా అభిప్రాయపడ్డారు. తనపైనా ఇదే విధమైన ఆరోపణలు చేశారని గుర్తు చేసుకున్నారు. అమెరికాలో మంచి లైఫ్ స్టయిల్ ను, సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని, అధిక వేతనాన్ని వదిలి ఇండియాను అభివృద్ధి చేసుకునేందుకు తాము వచ్చామని తెలిపారు. భారత ప్రజలు పనితీరు, ఉత్పాదకతలపై కాకుండా, తమకందే ప్రోత్సాహకాలు, పథకాలపైనే దృష్టిని సారించి వున్నారని, ఈ పరిస్థితి మారాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న నేతల పట్ల బయటకు గౌరవమిచ్చే వారు లోలోపల ద్వేషిస్తుంటారని, ప్రజలకు మేలు కలిగిస్తే, ప్రేమను, లేకుంటే కోపాన్ని చవిచూడాల్సి వుంటుందని తెలిపారు. అధికారాన్ని కోల్పోయిన తరువాత తీవ్ర వ్యతిరేకతను అనుభవించాల్సి వుంటుందని అన్నారు. రాజీవ్ గాంధీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తనకు ఎన్నో బెదిరింపులు ఎదురయ్యాయని, తన భార్యను అత్యాచారం చేస్తామని, పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని, అప్పట్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోని టెలికం మంత్రి ఏకంగా మీడియా సమావేశం పెట్టి తనను తిట్టిపోశారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రాజన్ అదే పరిస్థితిని ఎదుర్కొన్నారని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేశారని అన్నారు. దేశంలో పేదరికం, ఆకలి, దళితుల సమస్యలు, పారిశుద్ధ్యం, నిరుద్యోగం, పర్యావరణం, భద్రత, ఇంధన వనరుల కొరత వంటి ఎన్నో సమస్యలున్నా, వాటిని పాలకులు పక్కన బెట్టారని అన్నారు. రఘురాం రాజన్ తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించినా, వేధింపులను ఎదుర్కొన్నారని అన్నారు.

More Telugu News