: వచ్చే పదేళ్లలో భారీ ప్రాజెక్టులు: అరుణ్ జైట్లీ

వచ్చే పదేళ్లలో మౌలిక వసతుల కల్పన దిశగా ఇండియా ఎన్నో భారీ ప్రాజెక్టులను చేపట్టనుందని, వీటికి సుమారు 1.5 ట్రిలియన్ డాలర్ల వరకూ సమకూర్చుకోవాల్సి వుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ రహదారి సౌకర్యం లేని 700 గ్రామాలకు 2019 నాటికి రోడ్లను నిర్మించనున్నామని ఆయన తెలిపారు. ప్రపంచ మాంద్యం నుంచి స్థిరమైన వృద్ధి దిశగా ఇండియా సాగుతోందని, ఇక మౌలిక వసతుల కల్పనపై మరింతగా దృష్టిని సారించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఏఐబీబీ (ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్) బోర్డు గవర్నర్ల సమావేశం నిమిత్తం చైనా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, "వచ్చే దశాబ్ద కాలంలో, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎంతో అభివృద్ధి జరగాల్సివుంది. అత్యధిక నిధులను మౌలిక రంగానికే కేటాయిస్తాం" అని అన్నారు. గ్రామీణ పారిశుద్ధ్య పథకాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో 10 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యంగా ముందడుగు వేయనున్నామని వివరించారు. 100 సంవత్సరాల క్రితం సాంకేతికతతో తయారైన భారతీయ రైల్వే వ్యవస్థను ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటామని, రైల్వే స్టేషన్లను వాణిజ్య కేంద్రాలుగా మారుస్తామని జైట్లీ పేర్కొన్నారు.

More Telugu News