: ప్రాణాలొదిలిన ఆ జవాన్లకు నా సెల్యూట్: మోదీ

జమ్మూ కాశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు వదిలిన ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. "జమ్మూ కాశ్మీర్ లో అమరులైన వారి ధైర్యానికి నా జోహార్లు. వారు అకుంఠిత నిబద్ధతతో దేశానికి సేవ చేస్తూ, ప్రాణాలు వదిలారు. వారి మరణం నన్ను కలచివేస్తోంది" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ, ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మరణించగా, మరో 24 మంది జవాన్లు గాయపడ్డ సంగతి తెలిసిందే. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులూ మరణించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. నేడు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కే దుర్గా ప్రసాద్, హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు పాంపోర్ వెళ్లనున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులూ పాక్ నుంచే వచ్చారని సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.

More Telugu News