: బ్రిటన్ భయంతో జర్మనీ, ఫ్రాన్స్ లో మొదలైన అసలు గుబులు!

బ్రిటన్... దాదాపు మూడు దశాబ్దాలుగా యూరోపియన్ యూనియన్ లోని ప్రధాన సభ్య దేశంగా ఉంటూ వచ్చిన దేశం. అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోనే మంచి ఉపాధి అవకాశాలను దగ్గర చేస్తున్న ప్రాంతంగా గుర్తింపు పొందిన బ్రిటన్ కు స్వతహాగానే వలసలు అధికం. ఈ వలసలు స్థానిక యువతకు ఉపాధిని దూరం చేయగా, ఆపై స్వేచ్ఛా వాణిజ్యం బ్రిటన్ సంస్థల ఆదాయాన్ని తగ్గిస్తోందంటూ మొదలైన ప్రచారం 'బ్రెగ్జిట్'గా మారి, ప్రజల్లో సెంటిమెంట్ ను నింపి, రెఫరెండాన్ని ప్రకటించే వరకూ తీసుకువచ్చింది. ఆపై యూనియన్ నుంచి విడిపోవాలని ప్రజల్లో అత్యధికులు కోరుకుని తమ తీర్పును వెలువరించారు కూడా. ఇక ఈ తీర్పు యూనియన్ లోని రెండు ప్రధాన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ లలో కొత్త గుబులును రేపిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఎందుకంటే, ఈ రెండు దేశాల్లో సాధారణ ఎన్నికలు 2017లో జరగనున్నాయి. బ్రిటన్ యూనియన్ నుంచి తప్పుకుంటున్న వేళ, ప్రధాన దేశాలుగా ఉన్న మనం కూడా వెళ్లిపోదామని అటు జర్మనీలో, ఇటు ఫ్రాన్స్ లో ప్రజలలో సెంటిమెంట్ ను పెంచి అధికారానికి దగ్గర కావాలని విపక్షాలు చూస్తాయన్నది వారి వాదన. అటు బెర్లిన్ లో, ఇటు పారిస్ లో ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఆ దేశాల్లోని టెలివిజన్ చానల్స్ ఈ విషయంలో ప్రత్యేక చర్చలు జరిపాయి. వాస్తవానికి యూనియన్ లో 28 సభ్య దేశాలుండగా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల వాటా 25 శాతం వరకూ ఉంది. బ్రిటన్ వీడితే ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయడం అంత సులువేమీ కాదు. అదే సమయంలో ఫ్రాన్స్, జర్మనీలు సైతం అదే దారిలో పయనిస్తే, యూరోపియన్ యూనియన్ కుప్పకూలడం ఖాయం. ఎందుకంటే యూనియన్ లోని గ్రీస్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక లోటులో ఉండి ఇతర దేశాల సాయంపై ఆధారపడి బతుకుతుండగా, ఇటలీ, డెన్మార్క్ తదితర దేశాలు సైతం బ్రిటన్ దారిలో వెళ్లాలని ఇప్పటికే ఆలోచిస్తున్నాయి కాబట్టి. ప్రధాన దేశాలన్నీ యూనియన్ వద్దనుకుంటే, యూరప్ లోని పలు దేశాలు ఆర్థిక లోటులో కూరుకుపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News