: యూనివర్శిటీ చదువుకి, బ్రెయిన్ ట్యూమర్ కి లింకు... 43 లక్షల మందిని పరిశోధించి తేల్చిన అధ్యయనం

యూనివర్శిటీ చదువుకీ, బ్రెయిన్ ట్యూమర్ కీ సంబంధం వుందట. సాధారణ స్థాయి చదువు వున్న వారితో పోలిస్తే, యూనివర్శిటీ నుంచి డిగ్రీని పొందిన వారిలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం అధికమని బ్రిటన్ యూనివర్శిటీ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్, స్వీడన్ కేంద్రంగా నడుస్తున్న కరోలిన్ స్కా ఇనిస్టిట్యూట్, సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. 1911 నుంచి 1961 మధ్య జన్మించి, 1991 నాటికి స్వీడన్ లో నివసిస్తున్న 43 లక్షల మందిని అధ్యయనంలో భాగంగా పరిశీలించామని రీసెర్చర్లు వెల్లడించారు. వీరిలో 11 లక్షల మంది మరణించగా, 48 వేల మంది వలస వెళ్లారని, 5,735 మంది పురుషుల్లో, 7,101 మంది మహిళల్లో బ్రెయిన్ ట్యూమర్లు కనుగొన్నామని తెలిపారు. మూడేళ్ల యూనివర్శిటీ స్థాయి విద్యను అభ్యసించిన పురుషుల్లో 19 శాతం, మహిళల్లో 23 శాతం అధికంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని వెల్లడించారు. సాధారణ ఉద్యోగాలు చేస్తున్న వారితో పోలిస్తే, ఉన్నతోద్యోగులు 20 శాతం అధిక రిస్క్ కింద ఉన్నారని తెలిపారు. ఉన్నత విద్యా వంతుల్లో 50 శాతం మంది అకాస్టిక్ న్యూరోమా రిస్క్ లో, 26 శాతం మంది ప్రొఫెషనల్ మహిళలు మెనిన్ జియోమా రిస్క్ లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ అధ్యయనం వివరాలు 'జర్నల్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్'లో ప్రచురితమయ్యాయి.

More Telugu News