: కాల్ డ్రాప్ లకు అడ్డుకట్ట ఏది? : టెల్కోలపై మండిపడ్డ ట్రాయ్

ప్రముఖ టెలికం సంస్థలైన ఎయిర్ సెల్, వోడాఫోన్, ఐడియాలు కాల్ డ్రాప్ లను నివారించడంలో విఫలమవుతున్నాయని, కాల్ డ్రాప్ మాస్కింగ్ టెక్నాలజీ (ఆర్టీఎల్)ను తప్పుగా వాడుతూ, వినియోగదారులపై భారం మోపుతున్నాయని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆరోపించింది. ముఖ్యంగా ముంబై సర్కిల్ లో సమస్య అధికంగా ఉందని పేర్కొంది. ముంబై సర్కిల్ లో డ్రైవ్ టెస్ట్ జరిపి నివేదికను ఇచ్చిన ట్రాయ్, "నెట్ వర్క్ ను పెంచుకోవడంపై దృష్టిని సారించిన చాలా కంపెనీలు, మాస్కింగ్ టెక్నాలజీని వినియోగించుకోవడంలో తప్పు చేస్తున్నాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి" అని సలహా ఇచ్చింది. కాల్ డ్రాప్స్ ను అరికట్టేందుకు ఆర్టీఎల్ ను సమర్థవంతంగా వాడుకోవాలని సూచించింది. మంచి సిగ్నల్ ఉన్న ప్రాంతం నుంచి మాట్లాడుతూ, తక్కువ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వెళ్లి కాల్ కట్ చేసినప్పటికీ, అది ఇంకా కనెక్టయి ఉంటోందని ట్రాయ్ ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను కాయ్ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కొట్టి పారేసింది. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విధానాన్నే ఇండియాలోని టెల్కోలూ వాడుతున్నాయని చెప్పింది.

More Telugu News