: ఇండియాను నిలువరించి గెలిచాం: పాక్ విదేశాంగ మంత్రి

అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ ప్రవేశించకుండా అడ్డుకోగలిగామని పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్, ఆ దేశ పార్లమెంటుకు వెల్లడించారు. ఎన్ఎస్జీలో చేరాలన్న భారత ఆలోచనను విజయవంతంగా నిలువరించామని, ఎన్ఎస్జీ సభ్యత్వం మెరిట్ ఆధారంగా లభించాలి కానీ, వివక్షా పూరిత వాతావరణంలో కాదని ఆయన అన్నారు. ఇండియా ఎన్ఎస్జీలో చేరకుండా నిలువరించామని అన్నారు. ఈ ప్రపంచంలో పాకిస్థాన్ దేశం ఒంటరి కాదని, తమ దేశపు విదేశాంగ విధానాన్ని మెచ్చుకుంటున్న దేశాలూ ఉన్నాయని అన్నారు. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చకూడదన్న విధానానికి కట్టుబడే వున్నామని, ఇదే సమయంలో దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావిస్తే, కల్పించుకుంటామని తెలిపారు. భారత ప్రధాని ఇటీవలి కాలంలో ముస్లిం దేశాలను సందర్శించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ముస్లిం దేశాలతో చారిత్రాత్మక బంధాలను కలిగివున్న పాక్ పై మోదీ పర్యటన చూపించే ప్రభావమేమీ లేదని అన్నారు. అంతకుముందు ఇండియా ఎన్ఎస్జీలో చేరితే పాక్ ప్రయోజనాలు దెబ్బ తిన్నట్టేనని విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి.

More Telugu News