: ఉపాధ్యాయుల నిరసనపై పేలిన తూటా!... మెక్సికోలో 8 మంది మృతి, వందల మందికి గాయాలు!

విద్యా రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు గత కొన్ని నెలలుగా కొనసాగిస్తున్న ఆందోళనలు మెక్సికోలో హింసాత్మకంగా మారాయి. మెక్సికోలోని ఒయాక్సాకా రాష్ట్రంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా నిన్న రోడ్డెక్కిన ఉపాధ్యాయులు ఒయాక్సాకా-ప్యూబ్లా రాష్ట్రాల మధ్య రహదారిని దిగ్బంధించేందుకు యత్నించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఉపాధ్యాయులను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయులు విధ్వంసానికి దిగారు. కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు కూడా తమ తుపాకులకు పనిచెప్పారు. ఈ కాల్పుల్లో 8 మంది ఉపాధ్యాయులు అక్కడికక్కడే చనిపోగా, వందలాది మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యావత్తు మెక్సికో దేశాన్ని కుదిపేసింది.

More Telugu News