: రూపాయిని వణికించిన రాజన్, స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపలేకపోయారు!

భారత రిజర్వ్ బ్యాంకునకు గవర్నరుగా రఘురాం రాజన్ కొనసాగబోరని వచ్చిన వార్తలు ఫారెక్స్ మార్కెట్ ను కుదేలు చేయగా, స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. నేటి సెషన్ లో రూపాయి విలువ, స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవచ్చని నిపుణులు వ్యాఖ్యానించగా, వారి అంచనాలు ఫారెక్స్ మార్కెట్ వరకూ నిజమయ్యాయి. రూపాయి విలువ భారీగా దిగజారింది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ మాత్రం తట్టుకుని నిలిచింది. సెషన్ ఆరంభంలో నష్టాలు నమోదైనప్పటికీ, ఆపై గంట వ్యవధిలోనే సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోకి పయనించాయి. ఉదయం 10:55 గంటల సమయంలో సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో 26,683 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12.35 పాయింట్ల లాభంతో 8,182 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. టెక్నాలజీ రంగంలోని కంపెనీలు, ఐటీ దిగ్గజాలు లాభాల్లో సాగుతుండగా, బ్యాంకులు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. రూపాయి పతనం కారణంగానే ఐటీ కంపెనీలకు లాభాలు వచ్చాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News