: పేలిన 'రాజన్ బాంబు'తో మార్కెట్ కు గడ్డుకాలమే!

ఆర్బీఐ గవర్నర్ గా తాను రెండో దఫా కొనసాగబోవడం లేదని, సెప్టెంబర్ లో పదవీ విరమణ తరువాత, ఉపాధ్యాయ వృత్తిలోకి వెళతానని రఘురాం రాజన్ స్వయంగా చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని, సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ నష్టపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ తో పాటు రూపాయి విలువ కూడా దిగజారుతుందని విశ్లేషించారు. సోమవారం నాటి మార్కెట్ సెషన్ నష్టాల్లో ప్రారంభమవుతుందని, డాలర్ తో రూపాయి మారకపు విలువ 15 పైసల నుంచి 20 పైసల వరకూ నష్టపోవచ్చని, ఆపై ఒడిదుడుకులూ వెన్నంటి వస్తాయని భావిస్తున్నారు. మార్కెట్ వర్గాలను, ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరిచిన రఘురాం రాజన్ కామెంట్లతో భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు తదుపరి ఆర్బీఐ గవర్నర్ ఎవరన్నది వెల్లడి కాకపోయినా, ఇన్వెస్టర్ వర్గాల ఊహాగానాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ గవర్నరుగా ఉన్న ఉర్జిత్ పటేల్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య వరకూ పలువురి పేర్లు అప్పుడే చక్కర్లు కొడుతున్నాయి. ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్టుగా, 2008 నాటి ఆర్థిక మాంద్యంను ముందుగానే గుర్తించి హెచ్చరించిన నిపుణుడిగా, రాజన్ పేరు విదేశీ ఇన్వెస్టర్లలో పాతుకుపోయి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ హెడ్ అశుతోష్ రాణా వ్యాఖ్యానించారు. ఆయన నిన్న చేసిన ప్రకటన రూపాయి విలువపై తీవ్ర ప్రభావం పడేలా చేయనుందని, దీని ప్రభావం సోమవారం నాడు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి భారత మార్కెట్లకు గడ్డు రోజులేనని ఎల్అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ రూపా రేగే నెశ్చర్ తెలిపారు. ఓ ప్రజా సంస్థగా ఆర్బీఐపై ఉన్న విశ్వసనీయతను రఘురాం రాజన్ ఎంతో పెంచారని, ఆయన పదవిని వదులుతున్నారంటే, మార్కెట్ వర్గాలు అంత త్వరగా జీర్ణించుకోలేవని అన్నారు. ఆయన పోస్టుకు ఎవరిని ఎంపిక చేసినా, దేశ వ్యవస్థ ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో చాకచక్యాన్ని ప్రదర్శించాల్సి వుంటుందని వివరించారు.

More Telugu News