: కూల్ డ్రింక్స్ పై టాక్స్ వేసిన తొలి అమెరికన్ నగరంగా ఫిలడెల్ఫియా... ఔన్సుకు 1.5 సెంట్లట!

అమెరికాలో 'సోడా టాక్స్'ను అమల్లోకి తెచ్చిన తొలి పెద్ద నగరంగా ఫిలడెల్ఫియా నిలిచింది. ఈ పన్ను వద్దని బీవరేజ్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టి ప్రచారం నిర్వహించినా, సిటీ కౌన్సిల్ తుది ఆదేశాలు జారీ చేస్తూ, ప్రతి ఔన్సు కూల్ డ్రింక్ పై 1.5 సెంట్ల పన్ను కట్టాల్సిందేనని తేల్చింది. దీని ప్రకారం, సోడాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ 300 ఎంఎల్ బాటిల్ పై 15 సెంట్లు (సుమారు రూ. 9) కట్టాల్సి వుంటుంది. ఈ ఉత్తర్వులు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని ఫిలడెల్ఫియా కౌన్సిల్ ప్రకటించింది. కాగా, కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియా సహా 30 నగరాలు సైతం ఇదే తరహా చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ, అమలులో విఫలమయ్యాయి. ఈ పన్నును సక్రమంగా అమలు చేస్తే, సాలీనా 90 మిలియన్ డాలర్ల ఆదాయం తమ ఖజానాకు వస్తుందని ఫిలడెల్ఫియా మేయర్ జిమ్ కెన్నీ వెల్లడించారు. చిన్నారుల విద్యావసరాలు తీర్చడంతో పాటు, పాఠశాలలు, రిక్రియేషన్ సెంటర్ల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చిస్తామని తెలిపారు. ఈ పన్నును కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వసూలు చేస్తామని కౌన్సిల్ వెల్లడించగా, ఆ భారం వినియోగదారులు భరించాల్సిందేనని, 16 ఔన్సుల కూల్ డ్రింక్ బాటిల్ ఖరీదు 1.44 డాలర్ల వరకూ పెరుగుతుందని నిపుణులు లెక్కలు కట్టారు.

More Telugu News