: 732 వెబ్ సైట్లలో 'ఉడ్తా పంజాబ్' సినిమా... కనిపెట్టిన హైదరాబాద్ యాంటీ పైరసీ వింగ్

విడుదలకు ముందే ఆన్ లైన్లోకి వచ్చిన 'ఉడ్తా పంజాబ్' సినిమా, మొత్తం 732 వెబ్ సైట్లలో ఉందని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. పైరసీ అయిన చిత్రం సెన్సార్ బోర్డుకు సంబంధించిన కాపీయేనని స్పష్టంగా తెలుస్తోందని హైదరాబాద్ యాంటీ పైరసీ విభాగం హెడ్ ఏ రాజ్ కుమార్ వెల్లడించారు. ముంబై సైబర్ క్రైమ్ సెల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, చిత్ర లింకులను గుర్తించిన అన్ని వెబ్ సైట్ల నుంచి దాన్ని తొలగించామని, అయితే, మరిన్ని వెబ్ సైట్లలో లింకులు ప్రత్యక్షమవుతున్నాయని అయన తెలిపారు. కాగా, ఈ చిత్రం ఒరిజినల్ క్వాలిటీతో ఉన్న డీవీడీలు ముంబై సహా దేశంలోని పలుప్రాంతాల్లో రోడ్లపై లభిస్తున్నాయని తెలుస్తోంది. ఈ ప్రింటుపై 'ఫర్ సెన్సార్' అని స్పష్టంగా కనిపిస్తుండగా, కట్స్ లేని పూర్తి చిత్రం చూసేందుకు ఈ డీవీడీలను కొనుగోలు చేస్తున్నారని సమాచారం. కాగా 2.20 గంటల నిడివివున్న ఈ చిత్రం నేడు థియేటర్లను తాకిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆన్ లైన్లో ప్రత్యక్షం కావడం వెనుక నిర్మాతల హస్తం ఉందని, వారే పబ్లిసిటీ కోసం తమకిచ్చిన కాపీని ఆన్ లైన్లో పెట్టారని సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రహ్లాజ్ నిహలానీ ఆరోపించారు.

More Telugu News