: భారత్ కు న్యూజిల్యాండ్ మద్దతు!... పాక్ కు అండగా టర్కీ!: ఆసక్తికరంగా ఎన్ఎస్జీ సభ్యత్వ పోరు

అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న యత్నాలు ఆసక్తికర పరిణామాలకు తెర తీశాయి. అగ్రరాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు పలికిన భారత్ కు మద్దతిచ్చే విషయంలో చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక ఈ కూటమిలో మరో కీలక దేశంగా ఉన్న న్యూజిల్యాండ్ ఆదిలో భారత్ సభ్యత్వానికి ససేమిరా అన్నా... తాజాగా తన వైఖరి మార్చుకుంది. భారత్ కు సభ్యత్వం ఇచ్చే విషయంలో ఆ దేశం తన మద్దతును పలకనుంది. అయితే భారత్ దరఖాస్తు చేసేదాకా ఎన్ఎస్జీ సభ్యత్వంపై అంతగా ఆసక్తి చూపని పాకిస్థాన్... భారత్ అప్లై చేసిన మరుక్షణమే తన దరఖాస్తును కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తన అభ్యర్థిత్వానికి మద్దతును కూడగట్టేందుకు పాక్ రంగంలోకి దిగింది. తాజా సమాచారం మేరకు భారత్ అభ్యర్థిత్వానికి న్యూజిల్యాండ్ తరహాలోనే విముఖత వ్యక్తం చేసిన టర్కీ... పాక్ దౌత్యంతో తన మనసు మార్చుకుంది. భారత్ కు సభ్యత్వమిచ్చేందుకు తనకేమీ అభ్యంతరం లేదని చెబుతున్న టర్కీ... అదే సమయంలో పాక్ కు కూడా సభ్యత్వమివ్వాల్సిందేనని మెలిక పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న సీయోల్ లో ప్రారంభం కానున్న కూటమి భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

More Telugu News