: ‘ఉడ్తా పంజాబ్’కు బ్రేకులేనా?... బాలీవుడ్ చిత్రంపై సుప్రీంకోర్టులో పిటిషన్!

విడుదలకు ముందే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీసిన బాలీవుడ్ వివాదాస్పద చిత్రం ‘ఉడ్తా పంజాబ్’ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. పంజాబ్ రాష్ట్ర ప్రతిష్ఠను కించపరిచేలా ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 13 కట్లు చెప్పి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వగా... బాంబే హైకోర్టు మాత్రం ‘ఏ’ సర్టిఫికెట్ కు ఓకే చెప్పి సింగిల్ కట్ తోనే చిత్ర విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ లోని జలంధర్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘‘హ్యూమన్ రైట్స్ అవేర్ నెస్’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పంజాబ్ లోని డ్రగ్ మాఫియా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పంజాబ్ ప్రతిష్ఠను కించపరిచేలా సన్నివేశాలున్నాయని సదరు ఎన్జీఓ ఆరోపిస్తోంది. అయినా చిత్రంలో ఏ సీన్ ను కట్ చేయాలో, దేనిని కట్ చేయకూడదో నిర్ణయించే అధికారం బాంబే హైకోర్టుకు ఎక్కడుందని ఎన్జీఓ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నెల 17న (ఎల్లుండి) చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ పిటిషన్ పై తక్షణమే విచారణ చేపట్టాలని కూడా ఆ సంస్థ కోర్టును కోరింది. అయితే ముందుగా సవివరమైన పిటిషన్ దాఖలు చేస్తే... అసలు ఈ పిటిషన్ ను విచారించాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు ఎన్జీఓ లాయర్లకు సూచించింది.

More Telugu News