: ప్రాథమిక ఎన్నికలను విజయంతో ముగించిన హిల్లరీ, వాషింగ్టన్ లో విజయభేరి

అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ల తరఫున పోటీ పడేందుకు హిల్లరీ క్లింటన్ నామినేషన్ ఖరారైంది. ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా, చివరి రాష్ట్రమైన వాషింగ్టన్ లో జరిగిన ఎన్నికల్లో, ఆమె సమీప ప్రత్యర్థి శాండర్స్ పై సునాయాస విజయం సాధించారు. మొత్తం 4,763 మంది ప్రతినిధులు అన్ని రాష్ట్రాల ప్రాథమిక ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఎంచుకునేందుకు ఓట్లు వేయగా, హిల్లరీకి 2,831, శాండర్స్ కు 1,532 ఓట్లు వచ్చాయి. ప్రాథమిక ఎన్నికలు ముగిసినందున, ఇక ట్రంప్ ప్రచారానికి దీటుగా తానూ ప్రజల్లోకి వెళతానని హిల్లరీ వ్యాఖ్యానించారు. ట్రంప్ ను ఓడించగలనన్న నమ్మకాన్ని వెలిబుచ్చిన ఆమె, తుది ఎన్నికలు జరిగే నవంబర్ లోగా అన్ని ప్రాంతాలనూ కనీసం రెండు సార్లు చుట్టి రానున్నట్టు పేర్కొన్నారు. హిల్లరీకి అభినందనలు తెలిపిన శాండర్స్, ట్రంప్ ను ఓడించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఇక హిల్లరీ మలి దశ ప్రచారానికి భారీ ఏర్పాట్లు చేసేందుకు ఆమె టీమ్ కసరత్తు ప్రారంభించింది. ప్రచారానికి శాండర్స్ సహా పలువురు డెమోక్రాట్ నేతలు హాజరు కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News